నకిలీబాబా శివ రిమాండ్
లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డిని మోసం చేసిన కేసు
హైదరాబాద్: పూజల పేరుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డిని మోసం చేసి రూ.1.33 కోట్లతో ఉడాయించి అరెస్ట్ అయిన నకిలీ బాబా బుడ్డప్పగారి శివ(34)ను బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. శివకు సహకరించిన మరో ఇద్దరు నిందితులు ఈగ దామోదర్(44), గడప శ్రీనివాస్‌రెడ్డి(41)లను కూడా రిమాండ్‌కు తరలించారు. వీరందరినీ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నింది తులు ఈ నెల 15న బంజారాహిల్స్ రోడ్‌నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే ప్రముఖ వ్యాపారి గజ్జెల మధుసూదన్‌రెడ్డి అలియాస్ లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి నివాసంలో లక్ష్మీపూజ చేస్తే రెట్టింపు డబ్బులవుతాయంటూ పూజల్లో రూ.1.33 కోట్ల నగదు కట్టలు పెట్టించి.. ఆయన కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించారు. 17న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు, అతడికి సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేశారు.
బెంగళూరు శివారుల్లో ‘విల్లా’ కోసమే!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు శివారు ప్రాంతంలో ఓ పెద్ద విల్లాను కొనుగోలు చేయడమే లక్ష్యంగా బుడ్డప్పగారి శివ భారీ మోసాలకు తెర తీశాడని పోలీసు విచారణలో వెల్లడైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామానికి చెందిన శివ...తన ఊరికి దగ్గర్లో ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరు నగర శివారుల్లో భారీ విల్లాను కొనుగోలు చేసి సెటిల్ అవుదామనుకుని గత ఏడేళ్లలో రూ.4.25 కోట్లకుపైగా మోసాలు చేసిన శివ.. లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి ఉదంతంలో పోలీసులకు దొరికిపోవడంతో ఆ కోరికకు బ్రేక్ పడినట్టైంది. నిందితుడు ప్రస్తుతం కుటుంబంతో బెంగళూరు శివారు సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లే అవుట్‌లో ఓ అద్దె గదిలో ఉంటున్నట్టు పోలీసు విచారణలో వెల్లడించాడు.
అయితే తాను అనుకున్న ప్రకారం మధుసూదన్ రెడ్డి ఇంట్లో పూజ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదును తీసుకుని దేవాలయాల చుట్టూ కారులో తిప్పేందుకు ఓకే అనడంతో పెద్ద ముప్పే తప్పినట్టైంది. లేకపోతే మత్తుమందు ఎక్కువ డోస్‌లో ఇచ్చి చంపాలనుకుని ప్లాన్ చేసినట్టు సమాచారం. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సోమవారం జరగనుంది.