
రమ్య కుటుంబ సభ్యులకు మరో షాక్
రమ్య పిన్ని ప్రయాణిస్తున్న కారును బైక్‌తో ఢీకొన్న మైనర్
హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మృత్యువాత పడిన చిన్నారి రమ్య కుటుంబానికి మరో చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల క్రితం మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల పంజగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య, బాబాయ్ రాజేశ్, తాతయ్య చనిపోరుున విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో చనిపోరుున రాజేశ్ భార్య(రమ్య పిన్ని) శిల్ప.. తన అక్కా, బావతో కలసి మంగళవారం కాప్రా నుంచి నల్లగొండకు కారులో వెళ్తుండగా.. బైక్‌పై దూసుకువచ్చిన ఓ మైనర్ వారి కారును ఢీ కొట్టాడు. పంజగుట్ట ప్రమాదంతో భయం.. భయంగా ఉన్న శిల్ప తాజా ప్రమాదంతో షాక్‌కు గురయ్యారు.
కుషారుుగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బైక్ నడుపుతున్న బాలునికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రమ్య పిన్ని శిల్ప మీడియాతో మాట్లాడుతూ.. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల తమ కుటుంబంలో చోటు చేసుకున్న మూడు మరణాలతో ఇప్పటికీ తామంతా కుంగిపోతున్నామని, ఆ షాక్ నుంచి తేరుకోలేక ఇంట్లోనే ఉంటున్నామని చెప్పారు.
ఎంతకాలం ఇలా కుమిలిపోతావని అక్కా, బావ తనను బలవంతంగా ఒప్పించి బయటకు తీసుకెళ్తున్న క్రమంలో తిరిగి ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతను విస్మరించిన తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తున్నారని, ఇకనైనా అధికారులు మేల్కోవాలని, తమ పరిస్థితి మరే కుటుంబానికీ రాకుండా చూడాలని వేడుకున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.