సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొండపోచమ్మ (పాములపర్తి) రిజర్వాయర్ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 21 టీఎంసీల నుంచి 7-10 టీఎంసీలకు తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాజెక్టుపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, కొండపోచమ్మ సామర్ధ్యాన్ని పెంచాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది.
160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేవలం ఎల్లంపల్లి (20.17టీఎంసీలు), మిడ్‌మానేరు (25.175టీఎంసీలు) మినహాయిస్తే... నదీ ప్రవాహపు మధ్యలో నిర్మించదలిచిన మేడారం ఎత్తిపోతల, మోతే, అనంతగిరి, తిప్పారం రిజర్వాయర్లన్నీ తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవే. ఈ దృష్ట్యా తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, పాములపర్తి 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రణాళికను అనుసరించి కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో 53.74 మీటర్ల ఎత్తులో కట్ట ఏర్పాటు చేయాలి.
దీంతో 5,200 ఎకరాల ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున 1,055 గృహాలను తరలించాల్సి ఉంటుంది. దీనికి ఎగువన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ను రూ.5,978 కోట్లతో 50టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని సంకల్పించారు. అయితే ఇటీవల సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి.. కొండపోచమ్మ సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు తగ్గించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎగువన 50టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ ఉన్నందున దిగువన 21 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదని, ఈ దృష్ట్యా తగ్గించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.