Kondapocamma reservoir
-
‘కొండపోచమ్మ’లో చేప పిల్లలు వదిలిన మంత్రులు
సాక్షి, సిద్దిపేట : మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిలు చేప పిల్లలు వదిలారు. వర్గల్ మండలం గౌరారంలో ఉచిత పశు కృత్రిమ గర్భధారణ శిబిరాన్ని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు ప్రారంభించారు. (వారికిచ్చిన భూములు రద్దు చేస్తాం : కేటీఆర్) మానవులకు ఎంత విలువ ఉంటుందో జీవాలకు అంత విలువ ఉండాలని తలసాని అన్నారు. గోపాల మిత్రల సహకారం 3వేల నుండి 8వేల రూపాయలకు పెంచామని చెప్పారు. కరోనా కష్ట కాలంలో సైతం గోపాల మిత్రలకు జీతాలను అందించామని పేర్కొన్నారు. గొర్లకాపర్ల ఉపాధి పెరగడంతో, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతాంగానికి అనుసంధానంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. (సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం) కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం, చేపలు విడుదల చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ఏడాది కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో 7.5 టీఎంసీల నీటిని నింపుతామని తెలిపారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో 14లక్షల చేప పిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సమృద్ధిగా కురిసిన వర్షాలతో తెలంగాణ పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయన్నారు. ప్రతి చెరువు, చెక్ డ్యాం, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. -
పోచమ్మా.. తీర్చునమ్మా
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొండపోచమ్మ సాగర్‌తో మహానగర దాహార్తిని తీర్చేందుకుకొండంత అండ లభించనుంది. గ్రేటర్ దాహార్తిని మరోవందేళ్లపాటు తీర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. కొండపోచమ్మ సాగర్ నుంచి రెండు వరుసల భారీ పైపులైన్ల ద్వారా రా వాటర్‌ను బొమ్మరాస్పేట్ నీటిశుద్ధి కేంద్రానికి తరలించే అవకాశం ఉంది. అక్కడ శుద్ధి చేసిన నీటిని ప్రత్యేకంగా పైపులైన్లు ఏర్పాటు చేసి ఇప్పటికే అందుబాటులో ఉన్న గోదావరి రింగ్‌మెయిన్ పైపులైన్లకు అనుసంధానించే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జలమండలి ఆ దిశగా పనులు చేపట్టే అంశంపై దృష్టి సారించింది. బొమ్మరాస్పేట్లో నిత్యం 172 మిలియన్ గ్యాలన్ల రా వాటర్‌ను శుద్ధి చేసేందుకు భారీ నీటిశుద్ధి కేంద్రం నిర్మాణానికి 185 ఎకరాల దేవాదాయ భూమి సేకరణ పూర్తయ్యింది. దీంతో కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణంలో ఆలస్యం జరిగినా నిత్యం నగరానికి అదనంగా గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ నలుమూలలకు జలమండలి నిత్యం 480 మిలియన్ గ్యాలన్ల కృష్ణా, గోదావరి నీటిని తరలించి 10.60 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్న విషయం విదితమే. కేశవాపూర్ జలాల తరలింపుతో గ్రేటర్లో పానీ పరేషాన్‌కు చరమగీతం పాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోదావరి గలగలలు.. శామీర్‌పేట్ సమీపంలోని కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ చిక్కులున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర మట్టానికి సుమారు 618 అడుగుల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి 18 కి.మీ దూరంలో ఉన్న బొమ్మరాస్పేట్ నీటి శుద్ధి కేంద్రానికి (601 అడుగులకు) 3600 ఎంఎం డయా వ్యాసార్థమున్న భారీ మైల్డ్‌స్టీల్ పైపులైన్లను ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు వరుసల్లో ఏర్పాటు చేయనున్నారు. పైసా ఖర్చు లేకుండా భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ఆధారంగా ఇక్కడికి నీటిని తరలించవచ్చు. ఇక బొమ్మరాస్పేట నీటిశుద్ధి కేంద్రంలో 172 మిలియన్ గ్యాలన్ల (10 టీఎంసీలు) రా వాటర్‌ను శుద్ధి చేసి శామీర్‌పేట్.. సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైపులైన్‌కు స్వచ్ఛమైన గోదావరి జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ప్రస్తుతం కోటి ఉన్న గ్రేటర్ సిటీ జనాభా 2030 నాటికి రెండు కోట్లకు చేరుకున్నప్పటికీ తాగునీటికి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయర్ ప్రత్యేకతలివే.. ♦ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమయ్యే భూమి: సుమారు 1200 ఎకరాలు ♦ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం:రూ.2346 కోట్లు. ♦ రిజర్వాయర్ సామర్థ్యం: 5 టీఎంసీలు (గోదావరి జలాలు) ♦ ఫుల్ రిజర్వాయర్ లెవల్: 596 మీటర్లు ♦ ఎల్‌డబ్లు్యఎల్ (లోడ్ వాటర్‌లైన్ లెన్త్): 540 మీటర్లు ♦ నీటి వనరు: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ♦ రా వాటర్ తరలించడం: కొండపోచమ్మ సాగర్ నుంచి 18 కి.మీ మార్గంలో భూమ్యాకర్షణ శక్తి ద్వారా భారీ పైపులైన్ల ద్వారా కేశవాపూర్ రిజర్వాయర్ లేదా బొమ్మరాస్పేట్ నీటి శుద్ధి కేంద్రానికి తరలింపు ♦ మొత్తం పైపులైన్లు: 2 వరుసలు ♦ పైపులైన్ సామర్థ్యం: 3600 ఎంఎం డయా వ్యాసార్థం ♦ నీటిశుద్ధి కేంద్రం: బొమ్మరాస్పేట వద్ద 172 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసేందుకు వీలుగా నిర్మాణం ♦ రావాటర్ తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 16 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు ♦ శుద్ధి చేసిన నీటి తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 2 మెగా వాట్ల సామర్థ్యం గల 8 పంపులు ♦ సీడబ్ల్యూఆర్ (క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్): 80 మిలియన్ లీటర్లు -
గోదావరి జలాల ఎత్తిపోతలకు సర్వం సిద్ధం
-
కొండంత సంబురం నేడే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి వరప్రదాయిని అయిన కాళేశ్వ రం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరుగనుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మసాగర్రిజర్వాయర్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్ర ను లిఖించనుంది. ఈ చరిత్రా త్మక కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఉదయం నుంచే పూజలు.. శుక్రవారం ఉదయం 4.30 గంటల నుంచే ఏక కాలంలో కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీ యాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొని తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల కొండపోచమ్మసాగర్‌కు నీటిని ఎత్తిపోసే పంప్‌హౌస్ వద్దకు చేరుకుంటారు. 10 గంటల సమయంలో పంప్‌హౌస్ వద్దకు చేరుకొనే చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు పంప్‌హౌస్‌లలోని రెండు మోటార్లను ఆన్ చేసి గోదావరి ఎత్తిపోతలకు కేసీఆర్ శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి 11.35 గంటలకు ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ వద్దకు చేరుకొని గోదా వరి జలాలకు పూలతో స్వాగతం పలుకుతారు. గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి వరదరాజుపూర్ గ్రామంలోని వరదరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్తారు. అక్కడ పూజల అనంతరం 12.40 గంటలకు వరదరాజుపూర్ నుంచి మర్కూక్ పంప్‌హౌస్‌కు చేరుకొని అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కీలకపాత్ర... కాళేశ్వరంలోని మేడిగడ్డ నుంచి సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాల తరలింపులో ముగ్గురి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. అందులో మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. తన సొంత నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే లక్ష్యంతో పాత డిజైన్‌లో కేవలం ఒక టీఎంసీ సామర్థ్యమున్న ఈ రిజర్వాయర్‌ను 21 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ కింద భారీగా ముంపు, భూసేకరణ అధికంగా ఉండటంతో మళ్లీ దాన్ని 15 టీఎంసీలకు కుదించారు. అయినప్పటికీ భూసేకరణ సమస్యలు, ఆర్ అండ్ ఆర్ సమస్యలు తలెత్తడంతో స్వయంగా జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించారు. ఎప్పటికప్పుడు వివిధ విభాగాలను సమన్వయం చేస్తూ వచ్చారు. మంత్రి హరీశ్ సహకారం.. సీఎం ఆదేశాల మేరకు త్వరితగతిన 4,600 ఎకరాల భూసేకరణ జరిగేలా నాటి నీటిపారుదలశాఖ మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు కృషి చేశారు. భూసేకరణపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఆర్డీఓతోపాటు ప్రాజెక్టు ఇంజనీర్లకు సూచనలు చేస్తూ పంప్‌హౌస్, రిజర్వాయర్, కాల్వల పనులను పూర్తి చేయించారు. కొండపోచమ్మసాగర్‌కు ఎగువన ఉండే రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ కింద కాల్వల పనులను వేగంగా పూర్తి చేయించిన ఘనత ఆయనకే దక్కింది. ఈఎన్సీ హరిరామ్ సాంకేతిక సమన్వయం.. మిడ్‌మానేరుకు కా>ళేశ్వరం జలాలు చేరిన తర్వాత నుంచి రంగనాయక్‌సాగర్ వరకు నీటిని చేర్చడంలో ఈఎన్సీ హరిరామ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. అనంతగిరి, కొండపోచమ్మ కింద ముంపు గ్రామాల కోర్టు వ్యవహారాలను సమన్వయం చేయడం, 5 పంప్‌హౌస్‌లలో మోటార్ల బిగింపు, సమస్యల్లేకుండా నీటి ఎత్తిపోతలు, కాల్వలకు నీటి విడుదల కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కొండపోచమ్మ ఎస్ఈ వేణు సైతం కీలకపాత్ర పోషించారు. అలాగే పంప్‌హౌస్ పనులను చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ సైతం పంపులు, మోటార్లను తక్కువ కాలంలోనే ఏర్పాటు చేయడం, అవి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా సిద్ధం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. మర్కూక్ పంప్‌హౌస్‌లోని 34 మెగావాట్ల సామర్థ్యంగల 6 మోటార్లను తక్కువ కాలంలోనే మేఘా సంస్థ సిద్ధం చేసింది. -
అడుగు దూరంలో కొత్త చరిత్ర...
-
కొండపైకి గోదారి..
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలోనే సముద్రమట్టానికి అత్యధిక ఎత్తున నిర్మిస్తున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలకు ఈ నెల 29న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి పూజ, ఆశీర్వచనాల మధ్య మర్కూక్ పంప్‌హౌస్‌లో మోటార్లను ఆన్ చేయడం ద్వారా రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రెండ్రోజులే ఉండటంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్‌లు ఏర్పాట్లను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రావిటీ ద్వారా గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించిన హరీశ్‌రావు మర్కూక్ పంపుహౌస్ చూశారు. పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేసేందుకు సాంకేతిక అంశాలను నీటి పారుదల శాఖ ఎస్సీ వేణు, డీఈ మధులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా, తదితర ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా సీపీ జోయల్ డేవిస్ ఇతర అధికారులు పరిశీలించారు. అడుగు దూరంలో కొత్త చరిత్ర... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు వానాకాలంలోనే నీటిని తరలించిన ప్రభుత్వం.. గత రెండు నెలలుగా నాలుగో దశలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ మీదుగా రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ వరకు అటు నుంచి మల్కాపూర్, అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్‌ల మీదుగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు సమాయత్తమైంది. 15 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్ పనులు గతంలోనే పూర్తవగా ఇందులోకి నీటిని తరలించే అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్ పనులను ఇటీవలే పూర్తి చేశారు. కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని తరలించేలా మర్కూక్ పంప్‌హౌస్‌లో 34 మెగావాట్ల సామర్థ్యంగల 6 పంపులను సిద్ధం చేశారు. ఇందులో రెండు పంపులను సీఎం కేసీఆర్ 29న ఆన్ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని మేడిగడ్డ బ్యారేజీలో 88 మీటర్ల బెడ్‌లెవల్ నుంచి తీసుకుంటున్నారు. ఈ నీటిని మొత్తంగా 10 స్టేజీల ఎత్తిపోతల ద్వారా 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మసాగర్‌కు తరలిస్తే 530 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించినట్టవుతుంది. ప్రపంచంలో బహుళ దశల్లో నీటిని ఎత్తిపోయడం ఇదే మొదలని, ఈ అద్భుతం ఆవిష్కారం అయ్యేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నామని నీటిపారుదల ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మేడిగడ్డ నుంచి 200 కి.మీ. దూరంలోని కొండపోచమ్మసాగర్‌కు నీరు చేరడం కొత్త చరిత్రేనని అంటున్నారు. ప్రస్తుతం మిడ్‌మానేరులో లభ్యతగా ఉన్న నీటిని ఎత్తిపోస్తూ కొండపోచమ్మసాగర్‌లోకి కనీసం 2–3 టీఎంసీలను ఎత్తిపోసే అవకాశం ఉంది. అనంతరం వానాకాలంలో పూర్తిస్థాయిలో జరిగే ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్ నింపనున్నారు. ఈ వానాకాలంలోనే గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటన్‌చెరు, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో 26 మండలాల్లోని గ్రామాలకు 8 ప్రధాన కాల్వల ద్వారా గోదావరి జలాలను మళ్లించే అవకాశాలున్నాయి. దీనికింద 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా కనీసం సగం ఆయకట్టుకు నీరిందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ తెలంగాణకు కొండంత అండ... గోదావరి నీటిని కరువుపీడిత ప్రాంతాలైన కృష్ణా బేసిన్‌లోని ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే కొండపోచమ్మసాగర్ నుంచి నల్లగొండ జిల్లాలో గంధమల, బస్వాపూర్‌లకు నీటిని తరలించేలా ఇప్పటికే పనులు చేస్తోంది. కొండపోచమ్మసాగర్ నుంచే గంధమల మీదుగా 11.39 టీఎంసీల సామర్థ్యంగల బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించి అక్కడి నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఆయకట్టులకు నీటిని అందిచేలా ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. బస్వాపూర్ నుంచి హైలెవల్ కెనాల్ ద్వారా 45 కి.మీ. దూరంలోని చండూరు మండలం తుమ్మలపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు అటునుంచి ఇబ్రహీంపట్నం చెరువు మీదుగా పాలమూరు–రంగారెడ్డిలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు తరలించేలా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేశారు. బస్వాపూర్ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కులను 120 రోజులపాటు తరలించగలిగినా 21 టీఎంసీలను ఉద్దండాపూర్‌కు తరలించే అవకాశం ఉంటుందని, దీనికి రూ. 5 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇదే బస్వాపూర్ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించవచ్చని తేల్చారు. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు. ఇక కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చేలా కేశవాపూర్ రిజర్వాయర్‌కు ఇప్పటికే అనుమతులిచ్చారు. కొండపోచమ్మసాగర్ మీదుగా కేశవాపూర్ రిజర్వాయర్‌కు మూడు వరుసల గ్రావిటీ పైపులైన్ల ద్వారా నీటిని తరలించేలా త్వరలో పనులు చేపట్టనున్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా మరో ప్రణాళిక ఉంది. సంగారెడ్డి కాల్వ 27వ కి.మీ. వద్ద స్లూయిస్ నిర్మాణం చేసి అటునుంచి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా 50 కి.మీ. దూరాన ఉండే ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలన్నీ పట్టాలెక్కితే వాటన్నింటికీ నీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ కొండపోచమ్మసాగరే కానుంది. మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు ఎత్తిపోతల ప్రధానాంశాలు.. -
‘కాళేశ్వరానికి’ కొండ పోచమ్మ బ్రేకులు
సామర్థ్యం పెంచితే సమస్యలని తేల్చిచెప్పిన ఇంజనీర్లు.. - ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయ్యాక ఇప్పుడు మార్పులు ఎలా? - కేంద్ర పర్యావరణ, జల వనరుల శాఖలకు, సీడబ్ల్యూసీ, బోర్డుకు ఏం చెబుదాం - సీఎం ఆదేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తర్జనభర్జన మొద లైంది. విస్తృత చర్చలు, ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొలిక్కి తెచ్చిన ఈ ప్రాజెక్టులో మార్పులతో అంతా మళ్లీ మొదటికి వస్తోంది. ప్రతిపాదిత కొండ పోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే సిద్ధమైన ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)లో మార్పులు అనివార్యం కాను న్నాయి. వ్యయ అంచనాలు పెరగడం, మరింత భూసేకరణ చేయాల్సి రావడం, కొత్త కాల్వల నిర్మా ణంతో ప్రాజెక్టు డీపీఆర్ పూర్తిగా మారిపోనుంది. దీంతో ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పొందిన అనుమతులు, సీడబ్ల్యూసీ ముందు చేసిన వాదనలు, గోదావరి బోర్డుకు సమర్పిం చిన లెక్కలన్నీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తుండటంతో.. దీనిపై నీటి పారుదల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. మూడేళ్ల కసరత్తు వృథా..! కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మూడేళ్లుగా అనేక మార్పులు, చేర్పులు జరిగిన అనంతరం ప్రాజెక్టు స్వరూపం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి లో చర్చలు, వ్యాప్కోస్ సర్వేలు, అధికారుల అంచనా లు, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల పరిశీలన అనం తరం.. ప్రాజెక్టు కింద కొత్తగా సాగులోకి వచ్చే ఆయ కట్టు, పాత ప్రాజెక్టుల కింద స్థిరీకరణ, రిజర్వాయర్ల సామర్థ్యం, ప్రాజెక్టు వ్యయం తదితరాలపై ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందిం చింది. ప్రాజెక్టుకు మొత్తంగా రూ.80,499.71 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించి.. 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు మరో 18,82,970 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 150 టీఎంసీలు నిల్వ చేసుకునేలా 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా పాత ప్రాణహిత–చేవెళ్ల నమూనాలో ప్రతిపాదించిన 11.43 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 144 టీఎంసీలకు పెంచారు. భారీగా భూసేకరణ ఈ ప్రాజెక్టుకు 80 వేల ఎకరాల భూసేకరణ అవస రమని, అందులో 2,866 హెక్టార్లు (13,706 ఎకరా ల) అటవీ భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఈ వివరాలనే కేంద్ర పర్యావరణ శాఖకు, జల సంఘానికి సమర్పించింది. అయితే ఈ వివరాలపై కేంద్రం తొలుత విభేదించినా.. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్ల తో పర్యావరణ మదింపు చేసేందుకు అనుమతిచ్చిం ది. సీడబ్ల్యూసీ కూడా కొన్ని సందేహాలు లేవనెత్తినా చివరికి సానుకూలత తెలిపింది. మరోవైపు ఈ ప్రాజె క్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దాంతో కేంద్రం, బోర్డులు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కూడా కోరాయి. ప్రభుత్వం ఇంకా వివరణ చెప్పాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని నిర్ణయించడం నీటిపారుదల శాఖకు తలనొప్పి వ్యవహారంగా మారింది. భారీగా పెరగనున్న వ్యయం కొండపోచమ్మ రిజర్వాయర్‌ను 7 టీఎంసీల సామర్థ్యంతో రూ.519.70 కోట్లతో నిర్మించేందుకు కేబినెట్ అనుమతి తీసుకుని.. పరిపాలనా అనుమతులిచ్చి, డీపీఆర్‌లు కూడా సమర్పించారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యాన్ని 21 టీఎంసీలకు పెంచడమంటే మొత్తం వ్యవహారమంతా మొదటికి వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం మరో రూ.2,300 కోట్ల మేర పెరుగుతుందని, అదనంగా మరో 3 నుంచి 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, ముంపు గ్రామాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పులతో కొత్తగా డీపీఆర్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నాయి. ఒకవేళ కొత్త డీపీఆర్ చేయకుండా పాత డీపీఆర్‌తో ముందుకెళితే ఆంధ్రప్రదేశ్ మళ్లీ గోదావరి బోర్డు, కేంద్రం ముందు పంచాయితీ పెట్టే అవకాశాలున్నా యని చెబుతున్నాయి. అంతేగాకుండా కొత్త డీపీఆర్‌కు మళ్లీ కేంద్ర సంస్థల అనుమతి పొందాలంటే అనేక వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని నీటి పారుదల వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలో తెలియక తర్జనభర్జన పడుతున్నాయి. డీపీఆర్ కోరిన బోర్డు ఇక మరోవైపు గోదావరి బోర్డు కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తెలంగాణ వివరణ కోరింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరగా సమర్పించాలని సూచిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ బుధవారం లేఖ రాశారు. ఎంత ఆయకట్టు, ఎంత నీటి వినియోగం, ఎంత ఖర్చవుతుందనే వివరాలు తెలపాలని అందులో సూచించారు. -
‘కొండపోచమ్మ’ సామర్థ్యం కుదింపు
సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొండపోచమ్మ (పాములపర్తి) రిజర్వాయర్ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 21 టీఎంసీల నుంచి 7-10 టీఎంసీలకు తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాజెక్టుపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, కొండపోచమ్మ సామర్ధ్యాన్ని పెంచాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. 160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేవలం ఎల్లంపల్లి (20.17టీఎంసీలు), మిడ్‌మానేరు (25.175టీఎంసీలు) మినహాయిస్తే... నదీ ప్రవాహపు మధ్యలో నిర్మించదలిచిన మేడారం ఎత్తిపోతల, మోతే, అనంతగిరి, తిప్పారం రిజర్వాయర్లన్నీ తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవే. ఈ దృష్ట్యా తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, పాములపర్తి 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రణాళికను అనుసరించి కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో 53.74 మీటర్ల ఎత్తులో కట్ట ఏర్పాటు చేయాలి. దీంతో 5,200 ఎకరాల ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున 1,055 గృహాలను తరలించాల్సి ఉంటుంది. దీనికి ఎగువన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ను రూ.5,978 కోట్లతో 50టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని సంకల్పించారు. అయితే ఇటీవల సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి.. కొండపోచమ్మ సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు తగ్గించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎగువన 50టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ ఉన్నందున దిగువన 21 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదని, ఈ దృష్ట్యా తగ్గించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.