కొండపైకి గోదారి.. | CM KCR Inaugurate Kondapochamma Sagar Project On 29th May | Sakshi
Sakshi News home page

కొండపైకి గోదారి..

Published Wed, May 27 2020 1:39 AM | Last Updated on Wed, May 27 2020 10:21 AM

CM KCR Inaugurate Kondapochamma Sagar Project On 29th May - Sakshi

పనులు పూర్తయి నీటిని నింపడానికి సిద్ధంగా ఉన్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలోనే సముద్రమట్టానికి అత్యధిక ఎత్తున నిర్మిస్తున్న కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలకు ఈ నెల 29న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి పూజ, ఆశీర్వచనాల మధ్య మర్కూక్‌ పంప్‌హౌస్‌లో మోటార్లను ఆన్‌ చేయడం ద్వారా రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రెండ్రోజులే ఉండటంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్‌లు ఏర్పాట్లను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రావిటీ ద్వారా గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించిన హరీశ్‌రావు మర్కూక్‌ పంపుహౌస్‌ చూశారు. పంపుహౌస్‌ నుంచి గోదావరి జలాలను విడుదల చేసేందుకు సాంకేతిక అంశాలను నీటి పారుదల శాఖ ఎస్‌సీ వేణు, డీఈ మధులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా, తదితర ఏర్పాట్లను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా సీపీ జోయల్‌ డేవిస్‌ ఇతర అధికారులు పరిశీలించారు.  

అడుగు దూరంలో కొత్త చరిత్ర...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు వానాకాలంలోనే నీటిని తరలించిన ప్రభుత్వం.. గత రెండు నెలలుగా నాలుగో దశలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌ మీదుగా రంగనాయక్‌సాగర్‌ రిజర్వాయర్‌ వరకు అటు నుంచి మల్కాపూర్, అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌస్‌ల మీదుగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు సమాయత్తమైంది. 15 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌ పనులు గతంలోనే పూర్తవగా ఇందులోకి నీటిని తరలించే అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌస్‌ పనులను ఇటీవలే పూర్తి చేశారు. కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని తరలించేలా మర్కూక్‌ పంప్‌హౌస్‌లో 34 మెగావాట్ల సామర్థ్యంగల 6 పంపులను సిద్ధం చేశారు. ఇందులో రెండు పంపులను సీఎం కేసీఆర్‌ 29న ఆన్‌ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని మేడిగడ్డ బ్యారేజీలో 88 మీటర్ల బెడ్‌లెవల్‌ నుంచి తీసుకుంటున్నారు. ఈ నీటిని మొత్తంగా 10 స్టేజీల ఎత్తిపోతల ద్వారా 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మసాగర్‌కు తరలిస్తే 530 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించినట్టవుతుంది. ప్రపంచంలో బహుళ దశల్లో నీటిని ఎత్తిపోయడం ఇదే మొదలని, ఈ అద్భుతం ఆవిష్కారం అయ్యేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నామని నీటిపారుదల ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మేడిగడ్డ నుంచి 200 కి.మీ. దూరంలోని కొండపోచమ్మసాగర్‌కు నీరు చేరడం కొత్త చరిత్రేనని అంటున్నారు. ప్రస్తుతం మిడ్‌మానేరులో లభ్యతగా ఉన్న నీటిని ఎత్తిపోస్తూ కొండపోచమ్మసాగర్‌లోకి కనీసం 2–3 టీఎంసీలను ఎత్తిపోసే అవకాశం ఉంది. అనంతరం వానాకాలంలో పూర్తిస్థాయిలో జరిగే ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్‌ నింపనున్నారు. ఈ వానాకాలంలోనే గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటన్‌చెరు, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో 26 మండలాల్లోని గ్రామాలకు 8 ప్రధాన కాల్వల ద్వారా గోదావరి జలాలను మళ్లించే అవకాశాలున్నాయి. దీనికింద 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా కనీసం సగం ఆయకట్టుకు నీరిందించేలా చర్యలు తీసుకుంటున్నారు.


దక్షిణ తెలంగాణకు కొండంత అండ...
గోదావరి నీటిని కరువుపీడిత ప్రాంతాలైన కృష్ణా బేసిన్‌లోని ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే కొండపోచమ్మసాగర్‌ నుంచి నల్లగొండ జిల్లాలో గంధమల, బస్వాపూర్‌లకు నీటిని తరలించేలా ఇప్పటికే పనులు చేస్తోంది. కొండపోచమ్మసాగర్‌ నుంచే గంధమల మీదుగా 11.39 టీఎంసీల సామర్థ్యంగల బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించి అక్కడి నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఆయకట్టులకు నీటిని అందిచేలా ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. బస్వాపూర్‌ నుంచి హైలెవల్‌ కెనాల్‌ ద్వారా 45 కి.మీ. దూరంలోని చండూరు మండలం తుమ్మలపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు అటునుంచి ఇబ్రహీంపట్నం చెరువు మీదుగా పాలమూరు–రంగారెడ్డిలోని ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు తరలించేలా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేశారు.

బస్వాపూర్‌ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కులను 120 రోజులపాటు తరలించగలిగినా 21 టీఎంసీలను ఉద్దండాపూర్‌కు తరలించే అవకాశం ఉంటుందని, దీనికి రూ. 5 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇదే బస్వాపూర్‌ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించవచ్చని తేల్చారు. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు. ఇక కొండపోచమ్మసాగర్‌ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను తీర్చేలా కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు ఇప్పటికే అనుమతులిచ్చారు. కొండపోచమ్మసాగర్‌ మీదుగా కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు మూడు వరుసల గ్రావిటీ పైపులైన్ల ద్వారా నీటిని తరలించేలా త్వరలో పనులు చేపట్టనున్నారు. కొండపోచమ్మసాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా మరో ప్రణాళిక ఉంది. సంగారెడ్డి కాల్వ 27వ కి.మీ. వద్ద స్లూయిస్‌ నిర్మాణం చేసి అటునుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా 50 కి.మీ. దూరాన ఉండే ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలన్నీ పట్టాలెక్కితే వాటన్నింటికీ నీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌ కొండపోచమ్మసాగరే కానుంది.

మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మసాగర్‌ వరకు ఎత్తిపోతల ప్రధానాంశాలు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement