సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లోనే కాదు.. ఎంటెక్ కోర్సుల్లోనూ సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అనేక కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఒకవేళ ఉన్నా సరిపడా కంప్యూటర్లు సమకూర్చడం లేదు. అధ్యాపకుల కొరత కూడా ఎక్కువే. కొన్ని కాలేజీల్లో బోధనే సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరికొన్ని కాలేజీల్లో అనర్హులతో బోధన కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 50 శాతం వరకు కాలేజీల్లో అరకొరగా ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నట్లు అంచనా.
ఈ పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీ నుంచి ఎంఈ/ఎంటెక్‌లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక కాలేజీలకు ఇప్పటివరకు అఫిలియేషన్లే లభించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని గందరగోళం యాజమాన్యాల్లో నెలకొంది. అలాగే బీటెక్ ఇంజనీరింగ్ సీట్లలో కోతపడినట్లే పీజీ సీట్లు కూడా చాలా మేరకు కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎంటెక్‌కు బోధించాలంటే పీహెచ్‌డీ విద్యార్హత అవసరం. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్‌డీ లేని వారితోనే బోధన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎంఫార్మసీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా ఫార్మసీ కాలేజీల్లో ప్రయోగశాలలు సరిగా లేవని చెబుతున్నారు.
ప్రయోగాలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. బీటెక్ కోసం ఏర్పాటు చేసిన కొద్దిపాటి సదుపాయాలతోనే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీటెక్ కాలేజీల్లో సదుపాయాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. ఈ పీజీ కోర్సుల నిర్వహణ తీరుపైనా దృష్టి సారిస్తే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 349 ఎంటెక్, 188 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి.
వీటిలో దాదాపు సగం కాలేజీలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ కలిపి ఎంటెక్‌లో 41,178 సీట్లు ఉండగా, ఎం.ఫార్మసీలో 15,452 సీట్లు ఉన్నాయి. ఎక్కువ కాలేజీల్లో విద్యార్థుల హాజరు అసలే ఉండదని, అవి ఫీజులు వసూలు చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించే కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు కాలేజీల అఫిలియేషన్ల విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఎంటెక్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్/ఎంఆర్క్/ఎం.ఫార్మసీ/ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఈ ప్రవేశాలను చేపడతారు. ఈ నెల 6వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 10 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 2013, 2104 సంవత్సరాల్లో గేట్, జీప్యాట్ లేదా ఓయూ నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పూర్తి వివరాలను వెబ్ సైట్ (http://pgecet.apsche.ac.in, http://appgecet.org)లో ఉన్నాయి.
ఏం‘టెక్’ కాలేజీలో..!
Published Mon, Sep 1 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
Advertisement