రెండేళ్లలో పూర్తి చేయాలి
పాలమూరు రిజర్వాయర్లపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
♦ టెండర్లు పూర్తయిన నేపథ్యంలో పనుల వేగిరంపై సమీక్ష
♦ ప్రాజెక్టులు పూర్తి చేస్తే జిల్లాలో 15 లక్షల ఎకరాలకు నీరు
♦ దీనివల్ల వలసలు ఆగుతాయని ఆశాభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు, భూసేకరణ సమస్యల్లేనందున పనులను వేగంగా పూర్తిచేసి రైతుల పొలాల్లోకి సాగునీరు పంపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కరువు పీడిత, వలసల బాధిత పాలమూరు జిల్లా రైతులకు సాగునీరు అందించడాన్ని మొదటి లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు గడువు నిర్దేశించుకొని పనులను ఏకకాలంలో పూర్తి చేయాలని, ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్‌తోపాటు కర్వెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను రెండేళ్లలో పూర్తి చేయాలన్నారు.
ఇన్‌టేక్ వెల్, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, టన్నెళ్ల నిర్మాణం సమాంతరంగా జరగాలని సూచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. రిజర్వాయర్ల సామర్థ్యాన్ని నిర్మాణాలకు అనుగుణంగా పెంచుకుంటూ పోవాలని...కాల్వల నుంచి రిజర్వాయర్లకు నీరు పంపే క్రమంలోనే మధ్యలో ఉన్న చెరువులను కూడా నింపేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. అంతారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా నీరు అందించాలన్నారు. 16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా కోస్గి, కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్నారు. ఎలక్ట్రో మెకానికల్ డిజైన్ల రూపకల్పన కోసం విద్యుత్, నీటిపారుదలశాఖ అధికారులతో కమిటీ వేయాలన్నారు. సాగునీరు అందించే క్రమంలోనే మిషన్ భగీరథకూ నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు.
బిల్లుల చెల్లింపులను గమనిస్తా..
బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు ఏటా రూ.25 వేల కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నామని.. మంత్రి హరీశ్‌రావు చొరవతో కేంద్రం కూడా దాదాపు రూ. 3 వేల కోట్లు మంజూరు చేసిందని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టుల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ప్రతినెలా రూ. 2వేల కోట్లు విడుదల చేస్తున్నందున నిధుల విషయంలో ఢోకా లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ సైతం 60 శాతం పూర్తయిందని, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఉద్యోగులు, సిబ్బంది నియామకం, వాహనాల కొనుగోలు, పరికరాల సరఫరా వంటి చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పని పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపులను తాను కూడా ఆన్‌లైన్‌లో గమనిస్తుంటానన్నారు. మిగిలిన భూసేకరణ పనులను సైతం త్వరగా పూర్తి చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని, అందుకు కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
నీరు అందితే వలసలు ఆగుతాయి
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే మరో 7 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో వలసలకు అడ్డుకట్ట పడుతుందని... వలస వెళ్లినవారూ తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పొలాలకు నదీ జలాలు వస్తాయని రైతులు నమ్ముతున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టి తీరాలని, రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. సమావేశంలో మంత్రులు టి.హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, రంగారెడ్డి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.