ప్రశ్నించే గొంతును నొక్కుతోంది
కేంద్ర పాలనపై సిద్ధార్థ్ వరదరాజన్ ధ్వజం
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు నొక్కే దిశగా కేంద్రం పాలన కొనసాగుతోందని హిందూ మాజీ సంపాదకులు సిద్ధార్థ్ వరదరాజన్ అన్నారు. శుక్రవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘హైదరాబాద్ కలెక్టివ్’ నిర్వహించిన ‘ది అసాల్డ్ ఆన్ రీజన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై ఆయన ప్రసంగించారు. ‘విద్యను కాషాయీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోంది. హెచ్‌సీయూ, జేఎన్‌యూల్లో సంఘటనలు అధికార పార్టీ అసహనానికి గుర్తు. ఉన్నత విద్యను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం రాజ్యాంగ విలువలకు తిలోదాకాలిస్తూ... సంఘ్ పరివార్ శక్తుల నీడలో పయనిస్తోంది.
కొందరు మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా ప్రధాని మోదీ... ఇంకా వారిని మంత్రులుగా కొనసాగించడం ఇందుకు నిదర్శనం. దేశంలోని ఇతర ముస్లింలు దేశభక్తులు కాదనే విధంగా కేంద్ర మంత్రి ఒకరు ప్రసంగించినా ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉద్యోగాలొస్తాయని నమ్మి ఓటేసిన యువతను అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. యువతలో మత తత్వాన్ని ప్రేరేపిస్తూ కేంద్రం కాలం గడుపుతోంది.
రచయిత కల్బుర్గీని కాషాయీకరణలో భాగంగానే హత్య చేశారు. భారత మాత పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్సిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారినే వీసీలుగా నియమిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో పౌర సమాజం ప్రమాదంలో పడుతుంది’ అని సిద్ధార్థ్ వరదరాజన్ చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారు కేఆర్ వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్టు పరంజాయ్ గుహా తదితరులు పాల్గొన్నారు.