హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం ఆగడాలపై సిట్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిట్ అధికారులకు ఇప్పటివరకూ నయీం గ్యాంగ్ అరాచకాలపై 14 ఫిర్యాదులు అందాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నయీం పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
37 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎకరం కోటి రూపాయిలు ఉంటే కేవలం రూ.25 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నయీం కేసులో ఇప్పటివరకూ 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
మరోవైపు సిట్ బృందం ఇవాళ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో సమావేశమైంది. ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. కాగా అయిదుగురు నయీం అనుచరులు కోర్టులో లొంగిపోతారనే సమాచారంతో పోలీసులు అక్కడ మాటు వేశారు. వాళ్లు కోర్టులోకి వెళ్లకుండానే అరెస్ట్ చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.