rajendranagar police station
-
బండ్లగూడలో రూ.50 లక్షల నగలు చోరీ
రాజేంద్రనగర్: ఇంట్లో పనికోసం వచ్చిన ఓ బిహార్ జంట అదును చూసి ఇంట్లోని విలువైన నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పనికి కుదిరిన 55 రోజుల్లోనే ఈ జంట దొంగతనానికి పాల్పడి ఉడాయించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడలోని మైఫీల్ టౌన్ విల్లా నంబర్ 20లో డాక్టర్ కొండల్ రెడ్డి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నవంబర్ 1వ తేదీన ఏజెంట్ బిట్టు ద్వారా ఇంట్లో పనిచేసేందుకు బిహార్‌కు చెందిన నమీన్ కుమార్ యాదవ్, భారతిలను నెలసరి జీతంపై ఇంట్లో పనికి తీసుకొచ్చారు. తమ విల్లాలోని ఓ గదిని ఇచ్చి వారిని ఇంట్లోనే ఉండనిచ్చారు. ఈ క్రమంలో సోమవారం కొండల్‌రెడ్డి భార్య తన కుమారుల వద్దకు వెళ్లగా... కొండల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచి్చన ఆయన తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఉదయం కొండల్ రెడ్డికి కాఫీ ఇచ్చేందుకు నమీన్ కుమార్ రాకపోవడంతో కొండల్‌రెడ్డి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. కిందికి వెళ్లి చూడగా బయటి తలుపులు తెరిచి ఉండటంతోపాటు భార్యభర్తలిద్దరూ గదిలో కనిపించలేదు. ఇంట్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 8.52 గంటలకు భార్యభర్తలిద్దరూ బ్యాగ్‌లతో బయటికి వెళ్లినట్లు రికార్డు అయ్యింది. ఇంట్లోకి వచ్చి బీరువాను పరిశీలించగా..రూ.35 వేల నగదు, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ రింగులు, రూబీ డైమండ్ నెక్లెస్, మంగళసూత్రం తదితర బంగారు వస్తువులు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని డాక్టర్ కొండల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంటు బిట్టు వద్ద భార్యాభర్తలిద్దరి వివరాలను సేకరించారు. నిందితులిద్దరూ రైలు మార్గం ద్వారా వెళుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేక టీమ్ వీరిని పట్టుకునేందుకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీఎస్‌కు అవార్డు
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా 2023కుగాను ఎంపికైన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్)కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన అఖిలభారత డీజీపీ, ఐజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) బి. నాగేంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 17 వేల పోలీస్స్టేషన్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లగా ఇందులో 74 పోలీస్ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో కేంద్ర హోంశాఖ వెల్లడించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో రాజేంద్రనగర్ పీఎస్ తొలి స్థానంలో నిలవడం తెలిసిందే. స్టేషన్లో పోలీసులు చేపడుతున్న విధులు, కేసుల నమోదు, వాటి పరిష్కారంలో చూపుతున్న శ్రద్ధ, భార్యభర్తల గొడవల్లో కౌన్సెలింగ్, మహిళా భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని మృతదేహాల విషయంలో తీసుకుంటున్న చర్యలు.. స్టేషన్‌కు వచ్చిన వారిపట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు.. పీఎస్ పరిధిలో నమోదైన క్రైం రేట్.. దొంగతనాలు, దొంతనాల్లో రికవరీ శాతం వంటి అంశాల్లో ఈ స్టేషన్‌కు అవార్డు లభించింది. కాగా, దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్హెచ్ఓ బి. నాగేంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ రవి గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అభినందనలు తెలియజేశారు. -
నయీం అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలపై సిట్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిట్ అధికారులకు ఇప్పటివరకూ నయీం గ్యాంగ్ అరాచకాలపై 14 ఫిర్యాదులు అందాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నయీం పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 37 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎకరం కోటి రూపాయిలు ఉంటే కేవలం రూ.25 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నయీం కేసులో ఇప్పటివరకూ 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు సిట్ బృందం ఇవాళ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో సమావేశమైంది. ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. కాగా అయిదుగురు నయీం అనుచరులు కోర్టులో లొంగిపోతారనే సమాచారంతో పోలీసులు అక్కడ మాటు వేశారు. వాళ్లు కోర్టులోకి వెళ్లకుండానే అరెస్ట్ చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.