బండ్లగూడలో రూ.50 లక్షల నగలు చోరీ
పనిమనుషులే ఈ పనికి పాల్పడినట్లు గుర్తింపు
రాజేంద్రనగర్: ఇంట్లో పనికోసం వచ్చిన ఓ బిహార్ జంట అదును చూసి ఇంట్లోని విలువైన నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పనికి కుదిరిన 55 రోజుల్లోనే ఈ జంట దొంగతనానికి పాల్పడి ఉడాయించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడలోని మైఫీల్ టౌన్ విల్లా నంబర్ 20లో డాక్టర్ కొండల్ రెడ్డి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నవంబర్ 1వ తేదీన ఏజెంట్ బిట్టు ద్వారా ఇంట్లో పనిచేసేందుకు బిహార్‌కు చెందిన నమీన్ కుమార్ యాదవ్, భారతిలను నెలసరి జీతంపై ఇంట్లో పనికి తీసుకొచ్చారు.
తమ విల్లాలోని ఓ గదిని ఇచ్చి వారిని ఇంట్లోనే ఉండనిచ్చారు. ఈ క్రమంలో సోమవారం కొండల్‌రెడ్డి భార్య తన కుమారుల వద్దకు వెళ్లగా... కొండల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచి్చన ఆయన తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఉదయం కొండల్ రెడ్డికి కాఫీ ఇచ్చేందుకు నమీన్ కుమార్ రాకపోవడంతో కొండల్‌రెడ్డి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. కిందికి వెళ్లి చూడగా బయటి తలుపులు తెరిచి ఉండటంతోపాటు భార్యభర్తలిద్దరూ గదిలో కనిపించలేదు. ఇంట్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 8.52 గంటలకు భార్యభర్తలిద్దరూ బ్యాగ్‌లతో బయటికి వెళ్లినట్లు రికార్డు అయ్యింది.
ఇంట్లోకి వచ్చి బీరువాను పరిశీలించగా..రూ.35 వేల నగదు, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ రింగులు, రూబీ డైమండ్ నెక్లెస్, మంగళసూత్రం తదితర బంగారు వస్తువులు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని డాక్టర్ కొండల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంటు బిట్టు వద్ద భార్యాభర్తలిద్దరి వివరాలను సేకరించారు. నిందితులిద్దరూ రైలు మార్గం ద్వారా వెళుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేక టీమ్ వీరిని పట్టుకునేందుకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment