హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పటివరకూ 50 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన 39మంది బంధువులు, అనుచరులు సహా మరో 11మందిని అరెస్ట్ చేసినట్లు మంగళవారమిక్కడ వెల్లడించారు. మాజీ మావోయిస్టు శేషన్న సహా మరో అయిదుగురు కీలక అనుచరుల కోసం గాలిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.
పరారీలో ఉన్నవారు అరెస్ట్ అయితే కేసులో కీలక సమాచారంతో పాటు మరిన్ని ఆస్తులు, డంప్ దొరికే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు పాశం శీనును మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 వరకు సిట్ అధికారులు శీనును విచారించనున్నారు.