227 కేసులు.. 895 మంది సాక్షులు!
- నయీమ్ మృతి చెంది ఏడాది పూర్తి
- ఇప్పటివరకు 9 కేసుల్లోనే చార్జిషీట్
- త్వరలో 22 కేసుల్లో చార్జిషీట్ వేస్తామన్న సిట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ మృతికి మంగళవారంతో ఏడాది పూర్తయింది. నయీమ్ సాగించిన దందాలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లు.. ఇలా అన్నింటిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏడాది నుంచి నయీమ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్టేషన్లలో 227 కేసులు నమోదుకాగా, 895 మంది సాక్షులను సిట్ విచారించినట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పోలీస్ శాఖ స్పష్టం చేసింది. మొత్తం 128 మందిని అరెస్ట్ చేసి, వీరిలో 109 మందిని తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినట్లు సిట్ పేర్కొంది. ఇప్పటివరకు 9 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ దాఖలు చేశామని, త్వరలోనే మరో 22 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది.
మిగతా కేసుల్లో దర్యాప్తు తుది దశకు చేరుకుందని వెల్లడించింది. నయీమ్ గ్యాంగ్‌లోని 14 మందిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని, ఐదుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు సిట్ వివరించింది. అదే విధంగా మరో నలుగురు పోలీస్ అధికారులకు తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు, మరో 16 మంది అధికారులకు స్వల్ప తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మిగిలిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే పూర్తిచేస్తామని సిట్ అధికారులు తెలిపారు.