అనుమానాస్పద పార్శిళ్లపై నజర్
పోస్టల్, నిఘా సంస్థలతో కలసి సిట్ పటిష్ట నిఘా
- కార్గో ద్వారా వచ్చే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థ
- సినీ ప్రముఖులకు వస్తున్న కొరియర్లపై ఆరా
- రామానాయుడు స్టూడియోలో తనిఖీ
- పార్శిల్‌లో వెన్నునొప్పి పరికరం ఉండటంతో వెనుదిరిగిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పలువురికి నోటీసులిచ్చి విచారణ పూర్తి చేసిన సిట్ తాజాగా అనుమానాస్పద పార్శిళ్లపై దృష్టి సారించింది. పోస్టల్, కొరియర్ సంస్థల ద్వారా వస్తు న్న అనుమానిత పదార్థాలు, వస్తువులు కస్టమర్లకు చేరుతున్నట్లు గుర్తించింది. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ కూడా ఇలాగే సినీ ప్రముఖులతోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులకు చేరాయని ఇప్పటికే ఆధారాలతో నిరూపించింది. దీనిలో భాగంగా పోస్టల్ శాఖ తో పాటు పలు ప్రముఖ కొరియర్ సంస్థలతో నిఘా పటిష్టం చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలు చేపట్టామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. వివిధ దేశాల నుంచి విమాన సర్వీసుల్లోని కార్గోల ద్వారా వస్తున్న డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టపరుచుకున్నామని చెప్పింది. దీని నుంచి అందుతున్న సమాచారంతో మంగళవారం ముంబై నుంచి వచ్చిన దక్షిణాఫ్రికా వాసి నుంచి 10 గ్రాముల కొకైన్‌తోపాటు ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని అధి కారులు తెలిపారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్ట మ్స్, డిటెక్టివ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటి క్ కంట్రోల్ బ్యూరో సహకారంతో డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే యోచనలో ఉన్నట్టు కీలకాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించుతామని తెలిపారు.
డ్రగ్స్ కాదు.. వెన్నునొప్పి పరికరం
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో 3గంటల పాటు తనిఖీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను స్వాధీనం చేసుకొని తనిఖీ లు నిర్వహించారు. ఈ పార్శిల్‌లో వెన్నునొప్పికి సంబంధించిన పరికరం ఉందని ఇన్‌స్పెక్టర్ కనకదుర్గ తెలిపారు. అది తన కుమారుడు, హీరో రానాకు వచ్చిందని, అది వెన్నునొప్పికి సంబంధించినదని నిర్మాత సురేశ్‌బాబు వెల్లడించారు.