
మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం
హైదరాబాద్ : శాసనసభ లోపలే కాదు... బయట కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం కొనసాగించారు. అసెంబ్లీ బయట కూడా ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. సమావేశాలు పది నిమిషాలు వాయిదా అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా... వారిని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. తాము మీడియాతో మాట్లాడుతున్నామని, కొద్దిసేపు వేచి ఉండాలని అన్నారు.
అయితే టీడీపీ ఎమ‍్మెల్యేలు ...ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం నశించాలంటూ వైఎస్ఆర్ సీనీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
మహిళా ఎమ్మెల్యేలకు బాసటగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడకు వచ్చారు. అయితే ఆయనను అక్కడ నుంచి పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. టీడీపీ ఎమ‍్మెల్యేలు దౌర్జన్యం చేస్తుంటే తమను ఎలా లాక్కెళతారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడనీయడం లేదని, మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనివ్వడం లేదని, తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.