చనిపోయిన వ్యక్తి జీపీఏ చేశాడట! | sketch for 50 acres | Sakshi
Sakshi News home page

చనిపోయిన వ్యక్తి జీపీఏ చేశాడట!

Published Fri, May 11 2018 1:59 AM | Last Updated on Fri, May 11 2018 1:59 AM

 sketch for 50 acres - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ న్యాయవాది కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో (ఎంహెచ్‌ఏ) క్లర్క్‌గా పని చేస్తు న్న వ్యక్తి ఇచ్చిన సలహాతో భారీ స్కెచ్‌ వేశాడు. పుణేకు చెందిన కాందిశీకుడు పుప్పాలగూడలోని 50 ఎకరాలు తనకు విక్రయించినట్లు పత్రాలు సృష్టించాడు.

చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మిని స్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) నుంచి భూమి తన పేరిట బది లీ చేయించుకున్నాడు. రంగారెడ్డి కలెక్టర్‌ ద్వారా విషయం సీసీఎస్‌ పోలీసులకు చేరడంతో కథ అడ్డం తిరిగింది. చనిపోయిన వ్యక్తి ఏడాది తర్వాత జీపీఏ చేసినట్లు పత్రాలు సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు మొత్తం ఐదుగురు నిందితులపై అభియోగ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు రూ.750 కోట్ల విలువైన ఆ భూమి ప్రభుత్వ పరం కానుంది.  

ఎంహెచ్‌ఏ క్లర్క్‌ ఇచ్చిన సలహాతో...
నగరానికి చెందిన న్యాయవాది చెట్ల రాజయ్య లక్ష్మీనారాయణ గతంలో జీపీ ఫర్‌ రెవెన్యూగా పని చేసిన నేపథ్యంలో నిత్యం ఢిల్లీలోని వివిధ కార్యాలయాలకు వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఎంహెచ్‌ఏలోని సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేసే దేవేందర్‌ కుమార్‌ జైన్‌తో పరిచయమైంది. ఆయన 1950లో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చి కాందిశీకుడిగా మారిన హేమన్‌దాస్‌ హెచ్‌ మకీజ భూమి గురించి లక్ష్మీనారాయణకు చెప్పారు.

ఆయనకు అప్పటి సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ పుప్పాలగూడ ప్రాంతంలో 50 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమిని భౌతికంగా పొందక ముందే హేమన్‌దాస్‌ 1970లో మరణించగా... ఆయన కుమారుడైన భగవాన్‌ దాస్‌ మకీజ పుణేలో స్థిరపడ్డారు. అనంతరం భగవాన్‌ దాస్‌ ఈ స్థలం విషయం పట్టించుకోలేదు. ఇదే విషయం జైన్‌ ద్వారా లక్ష్మీనారాయణకు తెలిసింది.  

భూమిపై నకిలీ పత్రాలు సృష్టించి...
భారత్‌లో భూముల పొందిన కాందిశీకులు తమ వారసుల వివరాలను ఢిల్లీలో ఉండే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ వద్ద ఉండే క్లైమ్‌ ఇండెక్స్‌లో నమోదు చేయించాలి. విషయం తెలిసిన హేమన్‌దాస్‌ తన కుమారుడు భగవాన్‌ దాస్‌ పేరును ఇండెక్స్‌లో నమోదు చేయించారు.

పుప్పాలగూడలో ఉన్న 50 ఎకరాలు స్వాహా చేయడం సాధ్యమైతే తనకు కమీషన్‌ ఇవ్వాలనే ఒప్పందంతో జైన్‌ ఈ వివరాలన్నింటినీ లక్ష్మీనారాయణకు చెప్పారు. దీంతో భగవాన్‌దాస్‌ మకీజ ఆ 50 ఎకరాలను తనకు విక్రయిస్తూ 1996లో జీపీఏ చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ పత్రాలు సృష్టించారు.  

2003లో కేటాయించిన సీసీఎల్‌ఏ
ఈ నకిలీ పత్రాల ఆ«ధారంగా సీసీఎల్‌ఏ పుప్పాలగూడలోని భూమిని 2003లో లక్ష్మీనారాయణకు అప్పగించింది. ఇది నిబంధన ప్రకారం జరగలేదనే ఉద్దేశం తో 2006లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి హైకోర్టును ఆశ్రయించగా ఆ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై లక్ష్మీనారాయణ 2016లో సుప్రీం కోర్టు లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశా రు. దీంతో ఆ సమయంలో కలెక్టర్‌గా పని చేస్తున్న రజిత్‌ కుమార్‌ సేన్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


చనిపోయిన వ్యక్తి పేరుతో..
సీసీఎస్‌ ఏసీపీ ఎం.శ్రీనివాసులు ఆరా తీయగా.. భగవాన్‌దాస్‌ 1995లోనే చనిపోయినట్లు తేలింది. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పత్రాల్లో భగవాన్‌దాస్‌ 1996లో జీపీఏ చేసినట్లు ఉంది. దీంతో ఇవి బోగస్‌ పత్రాలుగా నిర్ధారించిన అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు.

విషయం వెలుగులోకి రావడంతో ఆయనతో పాటు దేవేందర్‌ కుమార్‌ జైన్, మిర్యాల నరసింహను గతంలో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులపై నాంపల్లి కోర్టులో గతవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీటిని సుప్రీంకోర్టులో దాఖలు చేసి, ఆ 50 ఎకరాలు ప్రభుత్వ పరం చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

రెండూ ఖరీదు చేసింది ఒకరే
‘కాందిశీకుడైన మలానీ స్కామ్‌లో పుప్పాలగూడలోని 148 ఎకరాలను సుకుమారెడ్డి నుంచి నందకిశోర్‌ ఖరీదు చేశారు. ఈ మకీజ స్కామ్‌లోనూ న్యాయవాది లక్ష్మీనారాయణ నుంచి 2005లో ఆ 50 ఎకరాలనూ నందకిశోరే రూ.3 కోట్లకు కొన్నారు.

ఈ నేపథ్యంలోనే మకీజ కేసులో నందకుమార్‌తో పాటు ఈ స్కాంలో పాత్ర ఉన్న పి.కృష్ణను నిందితుడిగా చేర్చి, నోటీసులు జారీ చేశాం. మా విచారణ ఫలితంగా పుప్పాలగూడలోని విలువైన 198 ఎకరాల భూమి ప్రభుత్వ పరం కానుంది’ – డాక్టర్‌ ఎం.శ్రీనివాసులు, సీసీఎస్‌ ఏసీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement