
రెండున్నరేళ్లలో స్కైసిటీ!
నగరంలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధికి రూ. 2,631కోట్లు
⇒పరిపాలనా అనుమతి
⇒మంజూరు చేసిన ప్రభుత్వం
⇒ఈపీసీ విధానంలో టెండర్లు.. త్వరలో నోటిఫికేషన్
⇒నిర్మాణానికి రెండున్నరేళ్ల గడువు.. కాంట్రాక్టు సంస్థదే నిర్మాణ వ్యయం
⇒పనులు పూర్తయ్యాక పదేళ్లలో
⇒20 వాయిదాలుగా చెల్లింపులు.. చెల్లింపు బాధ్యత జీహెచ్‌ఎంసీదే...
⇒రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఎటువంటి ట్రాఫిక్, సిగ్నల్ ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగించేలా 20 ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ)’ కింద రూ. 2,631కోట్ల పనులకు శుక్రవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎస్‌ఆర్‌డీపీ పనులపై ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు అధునాతన స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు/ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇందుకుగాను మూడు నాలుగు రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
ఇరవై ప్రాంతాల్లో..
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నివారణకు రూ.20వేల కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినా.. తొలిదశలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 20 ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ పనులను ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు. దీని ప్రకారంటెండరు దక్కించుకున్న సంస్థే పూర్తి వ్యయాన్ని భరించి ప్రాజెక్టును పూర్తిచేస్తుంది. అనంతరం ఆరుమాసాలకోమారు చొప్పున 20 ఇన్‌స్టాల్‌మెంట్లలో (మొత్తం పదేళ్లలో) జీహెచ్‌ఎంసీ ఆ సొమ్మును సదరు సంస్థకు చెల్లిస్తుంది. ఈ పనులను రెండున్నరేళ్లలో పూర్తిచేయాలనేది లక్ష్యంకాగా.. మూడో సంవత్సరం ఆరంభం నుంచి తిరిగి చెల్లింపును ప్రారంభిస్తారు. వాయిదాలను జీహెచ్‌ఎంసీ చెల్లించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇక ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధికి స్థలం అందుబాటులో ఉన్న చోట కాంట్రాక్టు సంస్థలతో వెంటనే ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించాలని.. మిగతా చోట్ల స్థలం అందుబాటులోకి రాగానే ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. పనిని మొత్తం ఒకరే చేయలేని పక్షంలో జాయింట్ వెంచర్‌గా గరిష్టంగా మూడు సంస్థలు కలసి చేసేలా అవకాశం కల్పించనున్నారు. దేశంలో ఈ విధానం ద్వారా భారీ ప్రాజెక్టులు చేపట్టిన తొలి మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ మిగలనుంది. భారీ ప్రాజెక్టు కావడంతో షాపూర్‌జీ పల్లోంజి, ఎల్‌అండ్‌టీలతో సహ పలు గ్లోబల్ సంస్థలు టెండర్‌లో పాల్గొంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఖర్చు ఎక్కువైనా..
ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో కొంత ఖర్చు ఎక్కువైనా సిమెంట్ కాంక్రీట్ కాకుండా ఐరన్ గడ్డర్స్‌ను వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని ద్వారా ఖర్చు 25 శాతం పెరిగినా.. 40 శాతం సమయం ఆదా అవుతుందని అంచనా వేశారు. ఇక జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వద్ద ఆరు లేన్లతో మల్టీలెవెల్ స్పైరల్ ఫ్లైఓవర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దీని అంచనా వ్యయం రూ.170కోట్లు. మిగతా ప్రాంతాల్లో నిర్మించే ఫ్లైఓవర్ల ఖర్చు సగటున దాదాపు రూ.50కోట్లు. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ఆయా జంక్షన్లలో అవసరాన్ని బట్టి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు (ఒకటి/రెండు/మూడు లెవెల్స్‌లో ఫ్లైఓవర్లు) ఏర్పాటు చేయనున్నారు.
పనులు చేపట్టే జంక్షన్లివే..
కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం, మహారాజ అగ్రసేన్ జంక్షన్, కేన్సర్ ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, రోడ్ నంబరు 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎల్‌బీనగర్, బైరామల్‌గూడ, కామినేని ఆస్పత్రి, చింతలకుంట చెక్‌పోస్టు, రసూల్‌పురా, ఉప్పల్, ఒవైసీ హాస్పిటల్, బయోడైవర్సిటీ పార్కు, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ విగ్రహం, బహదూర్‌పురా, అబిడ్స్ జీపీవో-చాదర్‌ఘాట్, మలక్‌పేట, సైబర్ టవర్స్ (ఎలివేటెడ్ రోటరీ కమ్ గ్రేడ్), మైండ్‌స్పేస్ (వీటిల్లో గ్రేడ్ సెపరేటర్లు/ఫ్లైఓవర్లు/జంక్షన్ల అభివృద్ధి, ఇతరత్రా పనులున్నాయి).