సాక్షి, ఖమ్మం జిల్లా: రెండేళ్ల క్రితం అదృశ్యమైన తల్లి చనిపోయిందనుకొని కర్మకాండలు పూర్తి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విచిత్ర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ-తిరపతయ్య దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుండి అదృశ్యమైంది.
ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పత్రికల్లోనూ, టీవీలోనూ ఆమె ఆచూకీ కోసం వెతక సాగారు. ఆమె వివరాల కోసం వెతికే సమయంలో సమీప ప్రాంతంలో కొండమీద ఒక మహిళను హత్య చేసిన సంఘటన జరిగింది. హత్యగావించబడ్డ మహిళ ఆధారాలు లభించకపోవడంతో మతిస్థిమితం లేక తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా భావించి ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేసి గత్యంతరం లేని పరిస్థితిలో కర్మకాండలు కూడా పూర్తి చేశారు.
తిరిగి రెండు సంవత్సరాల తర్వాత ఆమె కుమారుడు సోషల్ మీడియాలో కన్న తల్లిని గుర్తించిన కుమారుడు కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశాడు. ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ అనాథా శ్రమంలో ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా గుర్తుపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మను అనాథాశ్రమంలో కలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మధిర పోలీసులను సంప్రదించారు. సరైన ఆధారాలు ఉండటంతో మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment