
బంజారాహిల్స్‌లో యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్ 12లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అనకూడని మాటలు అనడంతోపాటు బైక్‌లు దిగి వెళ్లి ఆ యువతిపై చేయి చేసుకున్నారు. దీంతో వారికి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ యువతి గట్టిగా ప్రతిఘటించింది.
ఆమెకు దారిన పోయేవారు కూడా ఆ యువకులను పట్టుకునేందుకు పోగవడంతో ఆ పోకిరీలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ నెల 11న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు పోకిరీలు పాల్పడిన దుశ్చర్యలకు సంబంధించిన ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న పోకిరీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు దొరికిన తర్వాత కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.