
భార్యను తనతో పంపనందుకు..
భవనం పై నుంచి అత్తను తోసేసిన అల్లుడు
బాధితురాలి పరిస్థితి విషమం
అబిడ్స్: భార్యను తనతో పంపమని అత్తతో గొడవకు దిగిన ఓ అల్లుడు అత్తను భవనంపై నుంచి కోపంతో నెట్టివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడిన సంఘటన టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కార్వాన్ జోషివాడిలో గురువారం చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ బండారి రవీందర్ వివరాల ప్రకారం..బోరబండకు చెందిన గోపాల్(45),కు కార్వాన్ జోషివాడికి చెందిన యశోదాభాయి(60) కూతురు రాణితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఎలక్ట్రిషియన్‌గా పని చే స్తున్న గోపాల్ తరచూ భార్యతో గొడవ పడుతూ వేధింపులకు గురి చేసేవాడు. అతని వేధింపులు భరించలేని రాణి తన పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో గురువారం సాయంత్రం అత్తగారింటికి వచ్చిన గోపాల్ భార్యను తనతో పంపాలని అత్త యశోదాభాయితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆమె పంపనని చెప్పడంతో కోపోద్రిక్తుడైన గోపాల్ యశోదాభాయిని రెండవ అంతస్తులోని బాల్కనీ నుండి కిందకు తోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను టప్పాచబుత్ర పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు గోపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.