తండ్రినే బ్లాక్మెయిల్ చేసి...
హైదరాబాద్ : జల్సాలకు అలవాటుపడి ఓ యువకుడు దుండగులు తనను కిడ్నాప్ చేశారని తండ్రిని బెదిరించి, డబ్బు గుంజాడు. సదరు ప్రబుద్ధుడ్ని పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. పోలీసుల కథనం ప్రకారం... ముంబైకి చెందిన విజయ్ రోహన్ (23) బంజారాహిల్స్ రోడ్ నెం-2లో హాస్టల్లో ఉంటూ సోమాజిగూడలోని ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్లలో తిరగడం, ఖరీదైన హోటళ్లలో బస చేసి జల్సాలు చేయడం ఇతని హాబీ జల్సాలకు జీతం డబ్బు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ డ్రామాకు స్కెచ్ వేశాడు. ఈ నెల 16న తన ఫోన్ నుంచే ముంబైలో ఉండే తండ్రికి ఫోన్ చేసి... డబ్బు కోసం కొందరు తనను కిడ్నాప్ చేశారని, వెంటనే తన బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయాలని ఒత్తిడి చేశాడు.
ఎవరికైనా చెప్తే కిడ్నాపర్లు తనను చంపేస్తారని, ఎవరికీ చెప్పవద్దని తండ్రితో తెలిపాడు. 16వ తేదీ నుంచి శుక్రవారం వరకూ తన అకౌంట్లో తండ్రితో రూ.లక్షా 93 వేలు వేయించుకుని జల్సా చేశాడు. కిడ్నాపర్లు మళ్లీ డబ్బు అడుగుతున్నారని మళ్లీ తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి నేరుగా నగరానికి వచ్చాడు. విజయ్కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పడంతో అతను పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కొడుకే డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడాడని నిర్థారించారు. నిందితుడు విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.