kidnap drama.
-
తిడతారనే భయంతో బాలుడి హత్య..
సాక్షి, హైదరాబాద్ : శామీర్ పేట్ బాలుడు అదియాన్ మృతి కేసు కొలిక్కి వచ్చింది. అదియాన్‌తో కలిసి షేర్‌చాట్‌లో వీడియోలు చేసే ఓ మైనర్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ నర్సింగ్ రావు సోమవారం మీడియాకు తెలియజేశారు. ‘‘చనిపోయిన 5 ఏళ్ల బాబుతో నిందితుడు షేర్ చాట్‌లో వీడియోలు చేస్తుండేవాడు. బాలుడు జంప్ చేస్తుండగా అతడి తలకు గాయాలు అయ్యాయి. గాయాలు చూస్తే అదియాన్ తల్లిదండ్రులు తిడతారనే భయంతో బాబు గొంతు నులిమి చంపేశాడు. ( కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా.. ) చంపిన తర్వాత శవాన్ని గోనెసంచిలో కుక్కి, అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ వచ్చి ఓఆర్ఆర్ పక్కన పొదల్లో పడేశాడు. రెండు రోజుల తర్వాత బాబు తల్లిదండ్రులకు కాల్ చేసి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ నెంబర్, సీసీ కెమెరా ఆధారంగా కేసును ఛేదించాం. డబ్బులు ఇవ్వగానే బిహార్ పారిపోదామని నిందితుడు ప్లాన్ చేశాడు. నిందితుడు మైనర్, 20 రోజుల క్రితమే ఇంట్లో అద్దెకు వచ్చాడ’’ని అన్నారు. -
అమ్మ..నాన్న..మధ్యలో కిడ్నాప్
ఆడుకునేందుకు తమ్ముడు దగ్గరగా లేడు.. ఆప్యాయంగా పలకరించే అమ్మానాన్నలు దూరంగా ఉంటున్నారు.. హాస్టల్లో ఒక్కడే ఉంటూ రోజూ బాధపడేవాడు 11ఏళ్ల సుశాంత్.. ఒంటరిగా ఉండలేక.. హాస్టల్లో చదవలేక ఇబ్బందులు పడ్డాడు. ఇంటికి వెళితే మళ్లీ హాస్టల్‌కు పంపిస్తారు.. అందుకే ఓ ప్లాన్ వేశాడు.. తనను కిడ్నాప్ చేశారని నాటకమాడాలని నిర్ణయించుకున్నాడు.. అలాచేస్తే హాస్టల్‌కు పంపించరనేది ఆ చిన్నారి ఆలోచన.. అంతే ప్లాన్ అమలు చేశాడు..అయితే అది నాటకమని అమ్మానాన్నలకు తెలిసిపోయింది. పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఓ చిన్న సంఘటన కావచ్చు.. కానీ పిల్లలను హస్టళ్లలో వదిలితే ఎలా ఉంటుందో సుశాంత్ ఘటన అద్దం పడుతుంది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. లంగర్‌హౌస్ : శంషాబాద్‌లో వరలక్ష్మి, నరసింహ దంపతులు నివాసముంటున్నారు. వీరికి సుషాంత్(11), జశ్వంత్(9) కుమారులు. సుశాంత్‌ను ఈ సంవత్సరం లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్‌నగర్‌లోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ పాఠశాలలో చేర్పించారు. బాపునగర్‌లోని బాలుర వసతిగృహంలో ఉంటూ పాఠశాలకు వెళుతున్నాడు. ఈ నెల 24వ తేదీన సుశాంత్ గండిపేట మండలం హైదర్షాకోట్ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి పరుగుపరుగున వచ్చాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు తనను పాఠశాలకు వెళుతుండగా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, తాను అరుస్తుండగా టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూసి వదిలి పారిపోయారని చెప్పాడు. కిడ్నాప్ గ్యాంగులు నగరంలో సంచరిస్తున్నాయని వెంటనే పోలీసులను ఆశ్రయించాలని పలువురు చెప్పడంతో హాస్టల్ వద్ద ఉన్న స్థానికుల సహకారంతో కుటుంబసభ్యులు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా కట్టు కథ వరలక్ష్మి నరసింహ దంపతుల మధ్య జరిగిన గొడవల కారణంగా గత మే నెల నుండి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. తల్లి వద్ద సుశాంత్, తండ్రి వద్ద జశ్వంత్ ఉంటున్నారు. 23 వతేదీన కుమారుడిని చూడటానికి నరసింహ వసతి గృహానికి వెళ్లాడు. సుశాంత్ అక్కడ లేకపోవడంతో తిరిగి వచ్చేశాడు. తన భర్తే సుశాంత్ కిడ్నాప్‌కు ప్రయత్నించి ఉంటాడని వరలక్ష్మి పోలీసులకు చెప్పింది. అతన్ని పిలిపించి విచారించగా తండ్రి నిందితుడు కాదని తేల్చారు. బాలుడిని తీసుకొని వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఒక్కడే సంగం ఆలయం వద్ద బ్యాగు తగిలించుకొని వెళుతున్నట్లు గమనించారు. దీంతో బాలుడిని ఎవరూ కిడ్నాప్ చేయలేరని, కట్టు కథ అల్లి ముప్పతిప్పలు పెట్టాడని పోలీసులు నిర్దారించగా బాలుడు ఒప్పుకున్నాడు. దూరంగా ఉండలేక..... భార్యాభర్తలు విడిపోయిన తరువాత సుశాంత్‌ను తీసుకొని వరలక్ష్మి కాళిమందిర్కు వచ్చి అక్కడ అద్దెకు ఉంటోంది. తమ్ముడికి తండ్రికి దూరయిన సుశాంత్‌ను వసతి గృహంలో 20 రోజుల క్రితం చేర్పించారు. అందరికీ దూరంగా ఉండలేక కనీసం తాత, అమ్మమ్మ ఇంటి వద్ద ఉండాలని సుశాంత్ నిర్ణయించుకున్నాడు. వెంటనే బ్యాగు తీసుకొని నడుచుకుంటూ హైదర్షాకోట్ చేరుకున్నాడు.వాస్తవం చెబితే తనను తిరిగి వసతి గృహంలో వదిలేస్తారని భయపడిన బాలుడు కిడ్నాప్ కథ చెప్పానని ఒప్పుకోవడంతో కుటుంబీకులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులకు, కుటుంబీకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడంతో మూడు రోజుల నాటకానికి తెరపడింది. -
పిల్లాడి పిట్టకథ..ప్రజల భయాందోళన
కల్లూరు : కల్లూరుకు చెందిన బాలుడి కిడ్నాప్.. కట్టు కథగా తేలింది. కల్లూరు శాంతినగర్‌కు చెందిన గుండ్ర ప్రమోద్(13)ను ఇన్నోవాలో వచ్చిన ముగ్గురు కిడ్నాప్ చేసి ఖమ్మం తీసుకెళ్లారని, తప్పించుకుని బయటపడ్డానని, ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఖమ్మం వాసులు అప్పగించారని ప్రమోద్ చెప్పిన వివరాలతో పత్రికల్లో ఆదివారం వార్త ప్రచురితమైంది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తానే కట్టుకథ అల్లానని ఆ పిల్లాడు పోలీసులతో చెప్పాడు. తానే కల్లూరు నుంచి బస్సు ఎక్కి ఖమ్మం వెళ్లానని చెప్పాడు. కల్లూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేష్, ఎస్ఐ పవన్‌కుమార్ సమక్షంలో ప్రమోద్ ఇలా చెప్పాడు. ‘‘మా ఇంటి పక్కనున్న బాబాయికి చెందిన న్యూడిల్స్ బండిని కదిలిస్తుండగా, పక్కనున్న స్కూటర్ కింద పడిపోయింది. దాని ట్యాంకులోని పెట్రోల్ కారిపోయింది. బాబాయి అరవడంతో భయపడ్డాను. ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకుని కల్లూరు మెయిన్ రోడ్డు వద్దకు వెళ్లాను. అప్పుడే ఖమ్మం బస్సు రావడంతో ఎక్కాను. ఖమ్మం బస్టాండులో దిగాను. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళుతుండగా ఎవరో ఆపారు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని కట్టు కథ చెప్పాను. వారు పోలీసులకు అప్పగించారు. ఖమ్మం పోలీసులు మా అమ్మానాన్నను పిలిపించి అప్పగించారు’’. ప్రమోద్, ప్రస్తుతం సత్తుపల్లి మండలం తాళ్ళమడ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సీఐ, ఎస్ మాట్లాడుతూ.. ఇంటి వద్ద బాబాయి అరవడంతో ప్రమోద్ భయపడి కిడ్నాప్ కథ అల్లాడని చెప్పారు. వదంతులు నమ్మొద్దు కల్లూరురూరల్ : గ్రామాలలో కొంతమంది అనవసరంగా వదంతులు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వాటిని నమ్మవద్దని సత్తుపల్లి రూరల్ సీఐ మడత రమేష్, కల్లూరు ఎస్ఐ డి.పవన్‌కుమార్ కోరారు. ఆదివారం కల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దొంగల ముఠాలు లేవని, కిడ్నాపర్లు లేరని స్పష్టం చేశారు. గ్రామాలలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై దాడి చేస్తే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మతిస్థిమితం లేని వ్యక్తులు గ్రామాలలో తిరుగుతుంటారని, వారిపై దాడి చేయడం సరికాదని అన్నారు. దొంగల ముఠాలు, కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయంటూ వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, జీడిమెట్ల: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పది రోజుల క్రితం గాజులరామారం చిత్తారమ్మ జాతరలో ఉదయ్‌తేజ్ అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు డీసీపీ సాయిశేఖర్ ఆదేశాల మేరకు సవాల్‌గా తీసుకున్నారు. పోలీసులు 11 బృందాలతో గాలింపు చేపట్టి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. దీంతో భయపడ్డ కిడ్నాపర్లు ఉదయ్‌తేజ్‌ను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పొలంలో తెల్లవారు జామున వదిలి వెళ్లారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీశారు. జీడిమెట్ల పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు సిద్దిపేటకు చేరుకున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్‌కు తరలించనున్నారు. -
తండ్రినే బ్లాక్మెయిల్ చేసి...
హైదరాబాద్ : జల్సాలకు అలవాటుపడి ఓ యువకుడు దుండగులు తనను కిడ్నాప్ చేశారని తండ్రిని బెదిరించి, డబ్బు గుంజాడు. సదరు ప్రబుద్ధుడ్ని పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల కథనం ప్రకారం... ముంబైకి చెందిన విజయ్ రోహన్ (23) బంజారాహిల్స్ రోడ్ నెం-2లో హాస్టల్లో ఉంటూ సోమాజిగూడలోని ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్లలో తిరగడం, ఖరీదైన హోటళ్లలో బస చేసి జల్సాలు చేయడం ఇతని హాబీ జల్సాలకు జీతం డబ్బు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ డ్రామాకు స్కెచ్ వేశాడు. ఈ నెల 16న తన ఫోన్ నుంచే ముంబైలో ఉండే తండ్రికి ఫోన్ చేసి... డబ్బు కోసం కొందరు తనను కిడ్నాప్ చేశారని, వెంటనే తన బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయాలని ఒత్తిడి చేశాడు. ఎవరికైనా చెప్తే కిడ్నాపర్లు తనను చంపేస్తారని, ఎవరికీ చెప్పవద్దని తండ్రితో తెలిపాడు. 16వ తేదీ నుంచి శుక్రవారం వరకూ తన అకౌంట్లో తండ్రితో రూ.లక్షా 93 వేలు వేయించుకుని జల్సా చేశాడు. కిడ్నాపర్లు మళ్లీ డబ్బు అడుగుతున్నారని మళ్లీ తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి నేరుగా నగరానికి వచ్చాడు. విజయ్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పడంతో అతను పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కొడుకే డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడాడని నిర్థారించారు. నిందితుడు విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.