అమ్మ..నాన్న..మధ్యలో కిడ్నాప్‌  | Shamshabad Boy Kidnap Drama In Hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మ..నాన్న..మధ్యలో కిడ్నాప్‌ 

Published Sun, Jul 29 2018 11:16 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Shamshabad Boy Kidnap Drama In Hyderabad - Sakshi

సుశాంత్‌

ఆడుకునేందుకు తమ్ముడు దగ్గరగా లేడు.. ఆప్యాయంగా పలకరించే అమ్మానాన్నలు దూరంగా ఉంటున్నారు..  హాస్టల్‌లో  ఒక్కడే ఉంటూ రోజూ బాధపడేవాడు 11ఏళ్ల సుశాంత్‌.. ఒంటరిగా ఉండలేక.. హాస్టల్‌లో చదవలేక ఇబ్బందులు పడ్డాడు.  ఇంటికి వెళితే మళ్లీ హాస్టల్‌కు పంపిస్తారు.. అందుకే ఓ ప్లాన్‌ వేశాడు.. తనను కిడ్నాప్‌ చేశారని నాటకమాడాలని నిర్ణయించుకున్నాడు.. అలాచేస్తే హాస్టల్‌కు పంపించరనేది ఆ చిన్నారి ఆలోచన.. అంతే ప్లాన్‌ అమలు చేశాడు..అయితే అది నాటకమని అమ్మానాన్నలకు తెలిసిపోయింది. పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఓ చిన్న సంఘటన కావచ్చు.. కానీ పిల్లలను హస్టళ్లలో వదిలితే ఎలా ఉంటుందో సుశాంత్‌ ఘటన అద్దం పడుతుంది. లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 

లంగర్‌హౌస్‌ : శంషాబాద్‌లో వరలక్ష్మి, నరసింహ దంపతులు నివాసముంటున్నారు. వీరికి సుషాంత్‌(11), జశ్వంత్‌(9) కుమారులు. సుశాంత్‌ను ఈ సంవత్సరం లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్‌నగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ పాఠశాలలో చేర్పించారు. బాపునగర్‌లోని బాలుర వసతిగృహంలో ఉంటూ పాఠశాలకు వెళుతున్నాడు. ఈ నెల 24వ తేదీన సుశాంత్‌ గండిపేట మండలం హైదర్షాకోట్‌ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి పరుగుపరుగున వచ్చాడు.  ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు తనను పాఠశాలకు వెళుతుండగా  కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారని, తాను అరుస్తుండగా టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను చూసి వదిలి పారిపోయారని చెప్పాడు. కిడ్నాప్‌ గ్యాంగులు నగరంలో సంచరిస్తున్నాయని వెంటనే పోలీసులను ఆశ్రయించాలని పలువురు చెప్పడంతో హాస్టల్‌ వద్ద ఉన్న స్థానికుల సహకారంతో కుటుంబసభ్యులు లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

అంతా కట్టు కథ  
వరలక్ష్మి నరసింహ దంపతుల మధ్య జరిగిన గొడవల కారణంగా గత మే నెల నుండి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. తల్లి వద్ద సుశాంత్, తండ్రి వద్ద జశ్వంత్‌ ఉంటున్నారు. 23 వతేదీన  కుమారుడిని చూడటానికి నరసింహ  వసతి గృహానికి వెళ్లాడు. సుశాంత్‌ అక్కడ లేకపోవడంతో తిరిగి వచ్చేశాడు. తన భర్తే సుశాంత్‌ కిడ్నాప్‌కు ప్రయత్నించి ఉంటాడని వరలక్ష్మి పోలీసులకు చెప్పింది. అతన్ని పిలిపించి విచారించగా తండ్రి నిందితుడు కాదని తేల్చారు. బాలుడిని తీసుకొని వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఒక్కడే సంగం ఆలయం వద్ద బ్యాగు తగిలించుకొని వెళుతున్నట్లు గమనించారు. దీంతో బాలుడిని ఎవరూ కిడ్నాప్‌ చేయలేరని, కట్టు కథ అల్లి ముప్పతిప్పలు పెట్టాడని పోలీసులు నిర్దారించగా బాలుడు ఒప్పుకున్నాడు.  
 
దూరంగా ఉండలేక..... 
భార్యాభర్తలు విడిపోయిన తరువాత సుశాంత్‌ను తీసుకొని వరలక్ష్మి కాళిమందిర్‌కు వచ్చి అక్కడ అద్దెకు ఉంటోంది.  తమ్ముడికి తండ్రికి దూరయిన సుశాంత్‌ను వసతి గృహంలో 20 రోజుల క్రితం చేర్పించారు. అందరికీ దూరంగా ఉండలేక కనీసం తాత, అమ్మమ్మ ఇంటి వద్ద ఉండాలని సుశాంత్‌ నిర్ణయించుకున్నాడు. వెంటనే బ్యాగు తీసుకొని నడుచుకుంటూ హైదర్షాకోట్‌ చేరుకున్నాడు.వాస్తవం చెబితే తనను తిరిగి వసతి గృహంలో వదిలేస్తారని భయపడిన బాలుడు కిడ్నాప్‌ కథ చెప్పానని ఒప్పుకోవడంతో కుటుంబీకులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులకు, కుటుంబీకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపడంతో మూడు రోజుల నాటకానికి తెరపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement