
త్వరలో ఆకాశ మార్గాలు
నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు త్వరలో కొంతమేరకు తీరనున్నాయి.
ట్రాఫిక్ కష్టాలకు చెక్
11 ప్రాంతాల ఎంపిక
40 జంక్షన్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సిటీబ్యూరో:నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు త్వరలో కొంతమేరకు తీరనున్నాయి. రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిగ్నల్ జంక్షన్లు, ఫ్లై ఓవ ర్లు, మెట్రో రైలు మార్గంలో అవసరమైతే ట్రాక్‌లపై స్కై వేస్ (ఆకాశ మార్గాలు) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. నగరంలో సుమారు 40 జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. సిగ్నల్ పడే సమయంలో రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి... ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఆ మేరకు ట్రాఫిక్ రద్దీ గల ప్రాంతాల ఎంపికకు సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న హరిహరకళాభవన్ నుంచి ఉప్పల్ వరకు, మాసబ్‌ట్యాంక్ నుంచి హరిహరకళాభవన్, నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్, తార్నాక నుంచి ఇసీఐఎల్ క్రాస్‌రోడ్డు, చార్మినార్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు.. మొత్తం 11 స్కై వేలు నిర్మించాలని ప్రభుత్వానికి గ్రేటర్ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. వీటి మీదుగానే రోడ్లు మారే ఏర్పాట్లతో పాటు వాటి కింద వేరే మార్గాలు నిర్మించి ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని భావిస్తోంది. శివారు ప్రాంతాల్లోని ఎల్‌బీనగర్, ఉప్పల్, ఓవైసీ ఆస్పత్రి, తిరుమల గిరి జంక్షన్‌లతో పాటు బంజారాహిల్స్, సచివాలయం, ఖైరతాబాద్, అంబేద్కర్ సెంటర్, నెక్లెస్ రోడ్డు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చాదర్‌ఘాట్, కోఠి, సంగీత్, ప్యారడైజ్ తదితర ప్రదేశాల్లో మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.