
కంటోన్మెంట్ పరిధిలోని రాజీవ్ రహదారి
కంటోన్మెంట్: కంటోన్మెంట్ రూపురేఖలను మార్చేస్తామంటూ మూడేళ్లుగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఊదరగొడుతున్న స్కైవేల నిర్మాణం అటకెక్కినట్లే కనిపిస్తోంది. పోలో మైదానంలో సచివాలయంతో పాటు కంటోన్మెంట్‌లో రెండు స్కైవేల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు బోర్డు సభ్యులూ తెగ హడావిడి చేశారు. అయితే తాజాగా సచివాలయం తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడంతో ప్రతిపాదిత స్కైవేల భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సచివాలంతో పాటు స్కైవేల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు ఆర్మీ అంగీకారం తెలిపినప్పటికీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం గమనార్హం. తాజాగా నూతన సచివాలయానికి పాత స్థలంలోనే శంకుస్థాపన కూడా చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయంతో ముడిపడి ఉన్న స్కైవేల నిర్మాణం ఆగిపోయినట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన కోసం వేలాది మంది కంటోన్మెంట్ వాసులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రతిపాదిత స్కైవేల మార్గంలో రోడ్డుకిరువైపులా ఉన్న వారి వ్యాపారాల భవిష్యత్ ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉండటమే ఇందుకు కారణం.
రెండు ప్రధాన మార్గాల్లో..
ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు కంటోన్మెంట్ ద్వారానే రాజధానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే కంటోన్మెంట్‌లోని ఇరుకైన రోడ్ల కారణంగా తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేవలం 5–8 కిలోమీటర్ల కంటోన్మెంట్‌ను దాటేందుకే ఒక్కోసారి గంటకు పైగా సమయం కేటాయించాల్సి వస్తోంది. దీనికితోడు ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఈ మార్గం నుంచే తన ఫామ్ హౌజ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే పోలో మైదానంలోకి సచివాలయం తరలింపుతో పాటే స్కైవేల నిర్మాణం చేపట్టేందుకు ఆర్మీ స్థల సేకరణ చేపట్టారు. ఈ మేరకు సచివాలయానికి 60 ఎకరాలతో పాటు, నాగ్‌పూర్ హైవేపై ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు, ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట వరకు నిర్మించనున్న స్కైవేల కోసం మరో 90 ఎకరాల కంటోన్మెంట్ భూములను సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 550 ఎకరాలు అప్పగించేందుకు అధికారుల మధ్య ప్రాథమిక స్థాయిలో ఒప్పందం కూడా ఖరారైంది. స్థల బదలాయింపుతో పాటు సర్వీసు చార్జీల పేరిట ఏటా సుమారు రూ.30 కోట్లు చెల్లించాలన్న కంటోన్మెంట్ ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తరఫున తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అప్పటి మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ పలుమార్లు వెల్లడించారు. తాజాగా సచివాలయ తరలింపుపై రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గడంతో స్కైవేల నిర్మాణ ప్రతిపాదనలు నిలిచిపోయినట్లేనని అనధికారిక సమాచారం.
వ్యాపారుల్లో తొలగని ఆందోళన..
స్కైవేల నిర్మాణ ప్రక్రియి దాదాపు నిలిచిపోయినట్లేనని తెలుస్తున్నా ప్రతిపాదిత ప్రాంతాల్లోని వ్యాపారుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. కంటోన్మెంట్ పరిధిలోని కమర్షియల్ భవనాల్లో దాదాపు 80 శాతం ప్రతిపాదిత స్కైవేల మార్గంలోనే ఉన్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహదారి విస్తరణకు సంబంధించి మూడేళ్ల క్రితమే రోడ్డుకిరువైపులా మార్కింగ్‌లు కూడా చేశారు. దీంతో ఆయా భవన యజమానులతో పాటు, అందులోని వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఏ క్షణాన్నైనా విస్తరణ పనులు ప్రారంభమవుతాయని బిక్కుబిక్కుమంటూ కాలం గడుతున్నారు. ఈ క్రమంలో తాజా పరిణామాలు వారికి ఊరట కలిగిస్తున్నా, అధికారిక ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మార్గంలో అధికారులు మార్కింగ్‌లు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఖాళీ అయ్యాయి. టులెట్ బోర్డులు పెడుతున్నా కొత్త వ్యాపారులెవరూ సాహసించకపోవడంతో ఇటు యజమానులతో పాటు, అటు కంటోన్మెంట్ బోర్డుకూ నష్టం వాటిల్లుతోంది. దీంతో ఆస్తిపన్ను వసూళ్లు భారీగా తగ్గినట్లు బోర్డు సిబ్బంది పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment