
‘నైరుతి’ వచ్చేసింది
- రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు
- నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పూర్తిగా..
- హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాక్షికంగా విస్తరణ
- నేడు, రేపు రాష్ట్రవ్యాప్తమయ్యే అవకాశం
- నేడు భారీ వర్షాలు కురవచ్చని
- వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పూర్తిగా విస్తరించగా.. హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాక్షికంగా విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఇప్పటికే నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు ఊపందుకున్నాయని... ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
దీని కారణంగా అన్ని జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. శనివారం హన్మకొండలో అత్యధికంగా 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, రామగుండంలో 33.2, మెదక్‌లో 32.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం శనివారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా టేకులపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా కొల్హాపూర్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఆదిలాబాద్, బయ్యారం, ఇల్లెందు, చంద్రుగొండలలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లో వర్షం..: హైదరాబాద్‌లో శనివారం రాత్రి పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, ఈసీఐఎల్, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అల్పపీడనంగా మారితే భారీ వర్షాలు: రుతుపవనాల విస్తరణ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే మరికొన్ని రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం సముద్ర తీరం మీద ఉందని.. అది సముద్రం మీదకు వెళితే బలపడి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. అదే జరిగితే విస్తారంగా వానలు పడతాయని.. ఆవర్తనం భూమి మీదకు వస్తే బలహీనపడి వర్షాలు నిలిచిపోతాయని వెల్లడించారు. అయితే ఉపరితల ఆవర్తనం ఎటువైపు వెళుతుందనేది ఇప్పుడే తేల్చలేమన్నారు.
రైతుల్లో ఆశలు..
రుతుపవనాల రాకతో రాష్ట్ర రైతుల్లో ఆశలు చిగురించాయి. మంచి వర్షాలు కురిస్తే కరువు నుంచి బయటపడొచ్చని వారంతా భావిస్తున్నారు. ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు ప్రస్తుతం కురిసే వర్షాలకు విత్తనాలు చల్లేందుకు సిద్ధమవుతున్నారు. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు మరింత ఊపందుకుంటాయని.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని చెప్పారు.