
సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక శ్రద్ధ
సనత్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే మిగులు విద్యుత్‌ను సాధించిందని, ఈ క్రమంలోనే సోలార్ సంప్రదాయ విద్యుత్ ఉత్పాదనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్‌ఐఎస్‌ఈ), సురభి ఎడుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బేగంపేట్‌లోని స్వామిరామానంద తీర్థ మెమోరియల్ కమిటీ హాల్‌లో ‘సోలార్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యకిరణాలు ఎప్పటికీ తిరిగిపోనివని, గ్రీన్ ఎనర్జీగా పిలుచుకునే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 800 మెగావాట్ల ఉత్పత్తి చేశామని, మరో 2,000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం సోలార్ ఎనర్జీతో విద్యుత్ వ్యయం తగ్గిపోయిందన్నారు. తద్వారా నిర్మాణ, సరఫరా వ్యయాల్లో దుబారా తగ్గించగలిగామన్నారు. 2020 నాటికి దేశంలో 1,75,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా నిర్ణయించారని, తెలంగాణలో కూడా అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వివరించారు.
సోలార్ సంప్రదాయ విద్యుత్ ఉత్పాదన నిపుణులు, టెక్నీషియన్ల కొరత ఉందని, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆ లోటును భర్తీ చేయవచ్చన్నారు. జెన్‌కో చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ దేవులపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో వాణీదేవి, నారాయణరావు,పీవీ ప్రభాకర్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ జ్వాలా నర్సింహారావు, ప్రోగ్రామ్ డెరైక్టర్ శేఖర్ మారంరాజు, ఎస్‌ఆర్‌ఎస్ విన్ సోలార్ ఎండీ రామరాజు, డెరైక్టర్ టీఎస్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనార్క్ సర్టిఫికేషన్, సూర్యన్ ఇన్‌స్టాలేషన్ కోర్సులకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి విడుదల చేశారు.