జీతంలో రూ.10 వేలు చేతికి!
♦ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే యోచనలో
♦ సర్కారు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు
♦ ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా డ్రా చేసుకునే వెసులుబాటు
♦ ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరనున్న ప్రభుత్వం
♦ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరిన ఫైలు
సాక్షి, హైదరాబాద్: ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు యోచిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం విత్‌డ్రాపై ఆంక్షలు విధించడంతో ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుు. కనీసం రూ.10 వేల నగదు చేతికిచ్చేలా ఏర్పాట్లు చేయాలని టీఎన్‌జీవో ప్రతినిధులు సీఎస్ రాజీవ్‌శర్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలను నేరుగా చెల్లించటం వీలు కాదని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఆర్‌బీఐ విధించిన నగదు విత్‌డ్రా పరిమితి ఆంక్షల ప్రకారం ఏటీఎంల నుంచి రూ.2 వేలు మాత్రమే డ్రా చేసుకునే వీలుంది. ఖాతాదారులు బ్యాంకు నుంచి రోజుకు రూ.10 వేలు, గరిష్టంగా వారంలో రూ.24 వేలు మించకుండా డ్రా చేయాలి.
కానీ రాష్ట్రంలో దాదాపు ఎనభై శాతం ఏటీఎంలలో డబ్బు లేదు. బ్యాంకు బ్రాంచీల్లోనూ డబ్బు లేకపోవటంతో ఖాతాదారులు సైతం లైన్లలో గంటల తరబడి నిలబడి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఒకటో తారీఖున ఉద్యోగులు ముప్పు తిప్పలు పడటం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉద్యోగులందరికీ ఒకటో తేదీన కనీసం రూ.10 వేలు చేతికందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.
ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఉద్యోగులందరికీ సరిపడే నగదును అందుబాటులో ఉంచటం, ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా అంత మేరకు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని యోచిస్తోంది. ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రూ.10 వేలు ఉద్యోగులకు చెల్లించేందుకు అవసరమైన చర్యలు, ప్రతిపాదనలతో ఆర్థిక శాఖ ఫైలును సిద్ధం చేసింది. ఈ ఫైలును ముఖ్యమంత్రికి పంపించినట్లు తెలిసింది. సీఎం నిర్ణయం మేరకు నగదు చెల్లించాలా.. వద్దా.. అనే విషయంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను చర్చించేందుకు గురువారం రాష్ట్రస్థారుు బ్యాంకర్లతో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందులో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశాన్ని చర్చించే అవకాశాలున్నారుు.