
హౌసింగ్ స్కీమ్‌పై స్పెషల్ డ్రైవ్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో చేపట్టిన హౌసింగ్‌స్కీమ్ ప్రయోజనాల గురించి లబ్ధిదారులకు తెలిసేలా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ హైదరాబాద్ కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులకు సూచించారు. శనివారం తన చాంబర్‌లో హౌసింగ్ స్కీమ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌స్కీమ్‌కు లబ్ధిదారులు చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ చెల్లించకపోవడం..రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం తదితర ఇబ్బందులున్నాయని అధికారులు తెలిపారు.
అందుకు స్పందిస్తూ కమిషనర్ బ్యాంకర్ల జాబితా..రుణాల వివరాలతో నివేదిక రూపొందించాలని అన్నారు. అవసరమైతే ఆయా బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తే ముందుకొస్తారంటూ ఆస్తిపన్ను వసూళ్లకు ఇటీవల నిర్వహించిన ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రస్తావించారు. సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.