పోష్ కుర్రాడిలా గెటప్, పబ్బుల్లో వినోదం..ఆపై చోరీలు
హైదరాబాద్ : సంపన్న కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా గెటప్... బ్రాండెడ్ వస్తువులు... పబ్బుల్లో వినోదం... అక్కడికొచ్చే అమ్మాయిలతో పరిచయం. అమ్మాయిల ఇళ్ల వరకూ ప్రయాణం.. ప్రేమ పేరుతో మోసం.. వాళ్లకి తెలియకుండా అమ్మాయిల చుట్టుపక్కల ఇళ్లల్లో చోరీలు... ఇంజినీరింగ్ చదివిన ఓ ప్రబుద్ధుడి తీరిది. ఎవరికీ అనుమానం రాకుండా రెండున్నరేళ్ల నుంచి ఇలా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు.
పోలీసులకు సవాల్‌గా మారిన ప్రేమదొంగ మదన్... ఎట్టకేలకు శుక్రవారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 30 లక్షలకుపైగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కారును సీజ్ చేసి, విచారణ జరుపుతున్నారు.