
రకుల్‌ప్రీత్ సింగ్ కోసం 3 గంటల పాటు రోడ్డు మూసివేశారు
హైదరాబాద్: ఎస్ ఆర్ నగర్ పోలీసుల అత్యుత్సాహం వాహనదారులను ఇక్కట్ల పాల్జేసింది. ’బహార్ కేఫ్’ ను ప్రారంభించేందుకు సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తుందని పోలీసులు ఓ రోడ్డును మూసివేశారు. దాదాపు 3 గంటల పాటు రహదారిని మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పోలీసుల అత్యుత్సాహంపై మండిపడ్డారు. సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ కోసం ప్రజలను ఇబ్బందులను గురి చేయడం తగదని అన్నారు.
ఇక్కడి వంటకాలు ఎంతో ఇష్టం
అమీర్‌పేట: హైదరాబాద్ వంటకాలంటే తనకు ఎంతో ఇష్టమని సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ’బహార్ కేఫ్’ను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు నచ్చే నాణ్యమైన వంటకాలను అందించినప్పుడే ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు.
లాఠీచార్జి
సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తారన్న సమాచారంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎస్‌ఆర్‌నగర్ వచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాలు మీదుగా వాహనాలను దారి మళ్లించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై నిలబడటంతో నడిచేందుకు వీలులేని పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.