లక్ష ఉద్యోగాలేవి కేసీఆర్?
- తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను విస్మరిస్తారా?
- ‘తెలంగాణ జాగ్రఫి’ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి ఉద్యోగాలకే పరిమితమైందని మాజీమంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. తెలంగాణ సాధనపై పాఠ్యాం శాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాత్రను, తమ పార్టీ నేతల భాగస్వామ్యాన్ని పొందుపర్చకపోవడం శోచనీయమన్నారు. శాసనసభ మాజీ స్పీకర్, దివంగత శ్రీపాదరావు జ్ఞాపకార్థం గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డాక్టర్ ఆనంద్‌గోపగాని రూపొందించిన ‘తెలంగాణ జాగ్రఫి’ పుస్తకాన్ని శ్రీధర్‌బాబు బుధవారం గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజా సంఘాల పోరాటాలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ ఎల్లన్న, డాక్టర్ అక్తర్‌అలీ, ఇందిరా శోభన్, వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో విద్యార్థి నేతల చేరిక
ఉస్మానియా వర్సిటీ, నిజాం కళాశాలలోని విద్యార్థి సంఘాల నాయకులు లక్ష్మణ్, వినయ్, నవీన్, అజయ్, ఉమేశ్, సురేశ్ తదితరులు శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.