చావుకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఆయన: రాజమౌళి
సాక్షి, హైదరాబాద్: అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని, ఈ అవార్డు అందుకోవడం తన బాధ్యత మరింత పెంచిందని ప్రఖ్యాత ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో అక్కినేని జాతీయ పురస్కార వేడుక జరిగింది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కినేని కుమారులు వెంకట్, నాగార్జున తదితరులు హాజరైన వేడుకలో అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి ప్రసంగించారు.
'2002 వరకూ నా జోలికి రావద్దు’ అని చావుకు వార్నింగ్ ఇచ్చి మరీ అక్కినేని నాగేశ్వరరావు బతికారని గుర్తుచేశారు. ఆయన మనో బలంతో చావును దూరంగా ఉంచారని అన్నారు. చివరకు దేవుడు వచ్చి కేవలం శారీరకంగానే ఆయనను మన నుంచి దూరం చేశారు, కానీ, అక్కినేని కుటుంబం ఆయన ఆత్మను మనతోనే ఉండేలా చేసిందని అన్నారు. 'నేను రమ్మన్నప్పుడే నా దగ్గరకు రా'అని చావుతో మాట్లాడిన వ్యక్తులు మహాభారతంలో భీష్మాచార్యులు, ఈ కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు మాత్రమేనని కొనియాడారు. అంతటి మహానుభావుడి పేరుమీదున్న అవార్డును ఈ రోజు తనకు ఇస్తున్నారని, ఈ అవార్డుతో తన భుజ స్కందాలపై పెద్ద భారాన్ని పెట్టారని, ఆ అవార్డుకు మరింత గౌరవం తెచ్చేందుకు తన శాయశక్తులా కష్టపడతానని అన్నారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆదర్శప్రాయమని, ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచారని అన్నారు.