ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తొక్కిసలాట
ఐదుగురికి తీవ్ర గాయాలు...ఒకరి పరిస్థితి విషమం
హైదరాబాద్: ప్రాదేశిక సైన్యంలో తాత్కాలిక ప్రాతిపదికన జవాను, క్లర్క్ పోస్టుల ఎంపిక కోసం సికింద్రాబాద్‌లోని 125 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) శుక్రవారం నిర్వహించిన రిక్రూట్‌మెంట్ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అధికారులు ఒక్కసారిగా గేట్లు తెరవడం తోపులాటకు దారితీయడంతో పలువురు అభ్యర్థులు కిందపడగా వారిని తొక్కుకుంటూ మిగతా వారు లోపలకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి(40), సాయికుమార్(18), గుంటూరుకు చెందిన అవినాశ్ పాండే (18), శ్రీకాకుళానికి చెందిన వసంతరావు(18), ఐడీఏ బొల్లారానికి చెందిన వేణుగోపాల్(40) అనే అభ్యర్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్పృహ కోల్పోయిన వారిని హుటాహుటిన 108 అంబులెన్సులో తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. వీరితోపాటు ఇంకా చాలా మంది స్వల్ప గాయాలుకాగా ప్రథమ చికిత్స అనంతరం వెళ్లి పోయారు. అభ్యర్థులను నియంత్రించేందుకు సైనికాధికారులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
వివిధ రాష్ట్రాల నుంచి హాజరు...
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రల నుంచి టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన 18 నుంచి 42 ఏళ్ల వయసువారు రిక్రూట్‌మెంట్‌కు రావొచ్చని అధికారులు ప్రకటించారు. దీంతో కేవలం 34 పోస్టులకు ఏకంగా 20 వేల మంది యువకులు గురువారం రాత్రే తిరుమలగిరిలోని లోతుకుంటకు చేరుకొని షాపులు, ఫుట్‌పాత్‌ల వద్ద విశ్రమించారు. శుక్రవారం ఉదయం 5 గంటలకే అభ్యర్థులంతా తిరుమలగిరిలోని డొక్కా స్టేడియానికి తరలివచ్చారు. తొలుత 10 మంది యువకుల చొప్పున స్టేడియం లోపలకు పంపిన అధికారులు...ఆ తర్వాత రోడ్డు బ్లాక్ కావడం, ట్రాఫిక్ చిక్కులు ఏర్పడటంతో ఒక్కసారిగా గేట్లు తెరిచారు. దీంతో గేట్ల ముందు నిలబడిన వారిని వెనకున్న వారు నెట్టడంతో కింద పడిపోగా వారిని తోక్కుకుంటు మిగిలిన వారు లోపలకు పరుగులు తీశారు.
అంతా ముగిశాక వచ్చిన పోలీసులు
తొక్కిసలాటతోపాటు నానా రభస జరిగిన తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎంపిక సమయంలో ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉంటే ఇంత తొక్కిసలాట జరిగేది కాదని పలువురు అభ్యర్థులు విమర్శించారు. రిక్రూట్‌మెంట్ గురించి ఆర్మీ అధికారులు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వలేదని...పోలీసులు ఎంపిక ప్రాంతానికి రాకూడదనే నిబంధన విధించారని తెలిసింది.వివిధ బెటాలియన్‌ల పరిధిలో సహాయకంగా పనిచేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ పేరిట సైన్యం పార్ట్‌టైమ్ ఉద్యోగులను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించి ముందస్తుగా దరఖాస్తుల విధానాన్ని పాటించకుండా అభ్యర్థులంతా నేరుగా ఎంపిక కేంద్రానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటుంది. రాత పరీక్ష, ఇతరత్రా పోటీ విధానాన్ని పాటించని కారణంగా ముందుగా వచ్చిన వారికే ముందు (ఫస్ట్ కమ్ ఫస్ట్) ప్రాతిపదికన ఎంపిక చేస్తారేమోనని అభ్యర్థులు దరఖాస్తుల కోసం ఎగబడుతూ ఉంటారు.