Army selections
-
బహిర్భూమికి వెళ్లి యువకుడి మృతి..
గౌతంనగర్: ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే సదరు వ్యక్తికి సమాజంలో ఉండే గుర్తింపే వేరు. పైగా దేశ రక్షణలో పాలుపంచుకునే కొలువంటే ఇంకా గౌరవం. అందుకోసమే ఆ యువకులు భరతమాత రక్షణ సేవలో తరించాలని, ఆర్మీలో కొలువు సంపాదించాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా ఇక్కడ మాత్రం కనీస ఏర్పాట్లు లేక ఎముకలు కొరికే చలిలో అల్లాడుతున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం వచ్చిన యువకుల బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మౌలాలిలోని ఆర్ఫీఎస్ సెంటర్లో ఈ నెల 28 నుంచి ఆర్మీలో జేడీ, టైలర్, చెఫ్ కమ్యూనిటీ, స్పెషల్ చెఫ్, వాషర్మెన్, హెయిర్ డ్రెస్సెస్, మెస్ కీపర్ తదితర ఉద్యోగాల నియామకం కోసం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ ఎంపికలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 10 వేల మందికి పైగా తరలివచ్చారు. వీరిలో 4,350 మందిని మాత్రం పరీక్షకు అనుమతిచ్చారు. సుమారు 6 వేల మంది రోడ్లపైనే ఉన్నారు. మంగళవారం రాజస్థాన్, మహారాష్ట్ర, అభ్యర్థుల ఎంపిక చేపట్టగా 2,945 మంది వచ్చారు. బుధవారం తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, డయ్యూ, డామన్, లక్షదీప్, మేఘాలయ, పుదుచేర్చి ప్రాంతాల నుంచి 4 వేల మందికి పైగా హాజరయ్యారు. అయితే, అన్ని రాష్ట్రాలకు కలిసి 85 పోస్టులు మాత్రమే ఉండగా.. మొత్తం 20 వేల మందికి పైగా యువకులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో యువకులు వస్తారని ఆర్మీ అధికారులు అంచనా వేయకపోవడం గమనార్హం. యువకులకు ఉచితంగా భోజనం పెడుతున్న మన క్యాటరింగ్ ప్రతినిధులు యువకుడు మరణించినా మేల్కోని యంత్రాంగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల కోసం టాయిలెట్లు, బాత్రూమ్లు ఏర్పాటు చేయాలనే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా బహిర్భుమికి వెళ్లిన వనపర్తి జిల్లా యువకుడు అరవింద్ విద్యుదాఘాతానికి బలైన విషయం తెలిసిందే. అయినా సరే మేల్కోని అధికారులు తాత్కాలికంగా మూడు మొబైల్ టైయిలెట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వేల మంది యువకులకు రెండు మూడు బాత్రూమ్లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలియాలి. ఇక వచ్చిన వారికి అనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదు. ఇప్పటికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువకులు చలిలో వణుకుతూ రాత్రివేళ రోడ్ల మీదనే పడుకుంటున్నారు. తమ గోడు పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ యువకుల బాధలు చూడలేక ‘మన క్యాటరింగ్’ నిర్వాహకులు సెంటర్ సమీపంలో తాగునీరు, అల్పాహారం, భోజనం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఎన్నో కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసే ప్రభుత్వం, అధికారులు ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడాన్ని పలు విమర్శలకు తావిస్తోంది. పట్టించుకునే వారు లేరు ఆర్మీ సెలక్షన్స్ కోసం కర్ణాటక నుంచి ఒక రోజు ముందే మౌలాలి జేటీఎస్ సమీపంలోని ఆర్పీఎస్కు చేరుకున్నాం. రాత్రి పడుకోవడానికి కనీస వసతి లేదు. చలిలో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించాం. మా గోడు పట్టించుకునేవారు లేరు.– విటల్, అరుణ్ నాయక్ (కర్ణాటక) -
ఆర్మీ సెలక్షన్స్‌కు వచ్చిన యువకులకు సౌకర్యాల కల్పనలో విఫలం..
-
ఆర్మీ సెలక్షన్స్‌కు వచ్చిన యువకుడు మృతి
హైదరాబాద్: ఆర్మీలో సెలక్షన్స్ కోసం వచ్చి కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం ములమల్ల గ్రామానికి చెందిన అంజయ్య, శంకరమ్మ దంపతుల కుమారుడు ఎస్.అరవింద్ (19) వనపర్తిలో డిగ్రీ చదువుతున్నాడు. ఆర్మీలో సోమవారం జరిగే సెలక్షన్స్ కోసం ఆదివారం రాత్రి నగరానికి వచ్చాడు. మౌలాలి జేటీఎస్ సమీపంలో ఉన్న ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో ఉన్న ఓపెన్ ప్రదేశానికి బహిర్భూమికని వెళ్లాడు. ఈ ప్రదేశం ఎత్తుగా ఉండటంతోపాటు అంతా చీకటిగా ఉండ టంతో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ మన్మోహన్... అరవింద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అరవింద్ తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సౌకర్యాల కల్పనలో విఫలం.. సెలక్షన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువకులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. సెలక్షన్ కోసం ఆదివారం రాత్రికే ఇక్కడికి వచ్చిన యువకులకు కనీస వసతులు కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు ఆరోపించారు. ఇంతపెద్ద ఎత్తున ఆర్మీ సెలక్షన్స్ నిర్వహిస్తున్నప్పుడు యువకుల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నాయకులు, స్థానికులు తప్పుబట్టారు. ఇకముందైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో అరవింద్ మృతిచెందిన ఘటనాస్థలిని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సందర్శించారు. మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున రూ. 5 లక్షలు, ప్రభుత్వపరంగా రూ. లక్ష, తాను రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. అరవింద్ దహన సంస్కారాలకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున రూ. 25 వేల నగదును మృతుడి తండ్రికి అందజేశారు. సెలక్షన్ కోసం వచ్చిన వారికి రెండు రోజుల పాటు వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ ఆకుల నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్లో తొక్కిసలాట
ఐదుగురికి తీవ్ర గాయాలు...ఒకరి పరిస్థితి విషమం హైదరాబాద్: ప్రాదేశిక సైన్యంలో తాత్కాలిక ప్రాతిపదికన జవాను, క్లర్క్ పోస్టుల ఎంపిక కోసం సికింద్రాబాద్‌లోని 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) శుక్రవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అధికారులు ఒక్కసారిగా గేట్లు తెరవడం తోపులాటకు దారితీయడంతో పలువురు అభ్యర్థులు కిందపడగా వారిని తొక్కుకుంటూ మిగతా వారు లోపలకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి(40), సాయికుమార్(18), గుంటూరుకు చెందిన అవినాశ్ పాండే (18), శ్రీకాకుళానికి చెందిన వసంతరావు(18), ఐడీఏ బొల్లారానికి చెందిన వేణుగోపాల్(40) అనే అభ్యర్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్పృహ కోల్పోయిన వారిని హుటాహుటిన 108 అంబులెన్సులో తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. వీరితోపాటు ఇంకా చాలా మంది స్వల్ప గాయాలుకాగా ప్రథమ చికిత్స అనంతరం వెళ్లి పోయారు. అభ్యర్థులను నియంత్రించేందుకు సైనికాధికారులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి హాజరు... తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రల నుంచి టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన 18 నుంచి 42 ఏళ్ల వయసువారు రిక్రూట్మెంట్కు రావొచ్చని అధికారులు ప్రకటించారు. దీంతో కేవలం 34 పోస్టులకు ఏకంగా 20 వేల మంది యువకులు గురువారం రాత్రే తిరుమలగిరిలోని లోతుకుంటకు చేరుకొని షాపులు, ఫుట్‌పాత్‌ల వద్ద విశ్రమించారు. శుక్రవారం ఉదయం 5 గంటలకే అభ్యర్థులంతా తిరుమలగిరిలోని డొక్కా స్టేడియానికి తరలివచ్చారు. తొలుత 10 మంది యువకుల చొప్పున స్టేడియం లోపలకు పంపిన అధికారులు...ఆ తర్వాత రోడ్డు బ్లాక్ కావడం, ట్రాఫిక్ చిక్కులు ఏర్పడటంతో ఒక్కసారిగా గేట్లు తెరిచారు. దీంతో గేట్ల ముందు నిలబడిన వారిని వెనకున్న వారు నెట్టడంతో కింద పడిపోగా వారిని తోక్కుకుంటు మిగిలిన వారు లోపలకు పరుగులు తీశారు. అంతా ముగిశాక వచ్చిన పోలీసులు తొక్కిసలాటతోపాటు నానా రభస జరిగిన తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎంపిక సమయంలో ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉంటే ఇంత తొక్కిసలాట జరిగేది కాదని పలువురు అభ్యర్థులు విమర్శించారు. రిక్రూట్మెంట్ గురించి ఆర్మీ అధికారులు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వలేదని...పోలీసులు ఎంపిక ప్రాంతానికి రాకూడదనే నిబంధన విధించారని తెలిసింది.వివిధ బెటాలియన్ల పరిధిలో సహాయకంగా పనిచేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ పేరిట సైన్యం పార్ట్‌టైమ్ ఉద్యోగులను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించి ముందస్తుగా దరఖాస్తుల విధానాన్ని పాటించకుండా అభ్యర్థులంతా నేరుగా ఎంపిక కేంద్రానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటుంది. రాత పరీక్ష, ఇతరత్రా పోటీ విధానాన్ని పాటించని కారణంగా ముందుగా వచ్చిన వారికే ముందు (ఫస్ట్ కమ్ ఫస్ట్) ప్రాతిపదికన ఎంపిక చేస్తారేమోనని అభ్యర్థులు దరఖాస్తుల కోసం ఎగబడుతూ ఉంటారు. -
ఫిబ్రవరిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కలెక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందని, ఇందుకు సహకరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ కె. ఇలంబరితి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞాసమావేశమందిరంలో సమావేశంలో మా ట్లాడారు. గతంలో కొత్తగూడెంలో నిర్వహించిన ఆర్మీ ఎంపికలు విజయవంతమయ్యాయని, అదే విధంగా ర్యాలీకి యువకులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనరల్ డ్యూటీ సోల్జర్స్, టెక్నికల్ సోల్జర్స్, క్లర్క్ సోల్జర్స్, నర్సింగ్ అసిస్టెంట్ సోల్జర్స్, ట్రేడ్స్మెన్సోల్జర్స్ల ఎంపికలు ఉంటాయని తెలి పారు. ఎంపికైన వారికి సికింద్రాబాద్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు డాక్యూమెంట్ల పరిశీలన చేస్తారన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వారికి కేటాయించిన విధులు నిర్వహించి న ఆర్మీ రిక్రూట్ మెంట్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ డెరైక్టర్ కల్నల్ అనిల్ కుమార్ రోహిల్లా, అదనపు సంయుక్త కలెక్టర్ బాబూరావు, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, డ్వామా, డీఆర్డీఏ పీడీలు జగత్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్‌లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. భానుప్రకాశ్ పాల్గొన్నారు.