వసతులు లేక రోడ్డుపై బైఠాయించిన యువకులు ,తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్
గౌతంనగర్: ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే సదరు వ్యక్తికి సమాజంలో ఉండే గుర్తింపే వేరు. పైగా దేశ రక్షణలో పాలుపంచుకునే కొలువంటే ఇంకా గౌరవం. అందుకోసమే ఆ యువకులు భరతమాత రక్షణ సేవలో తరించాలని, ఆర్మీలో కొలువు సంపాదించాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా ఇక్కడ మాత్రం కనీస ఏర్పాట్లు లేక ఎముకలు కొరికే చలిలో అల్లాడుతున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం వచ్చిన యువకుల బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మౌలాలిలోని ఆర్‌ఫీఎస్ సెంటర్‌లో ఈ నెల 28 నుంచి ఆర్మీలో జేడీ, టైలర్, చెఫ్ కమ్యూనిటీ, స్పెషల్ చెఫ్, వాషర్‌మెన్, హెయిర్ డ్రెస్సెస్, మెస్ కీపర్ తదితర ఉద్యోగాల నియామకం కోసం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు.
ఇంకా ఈ ఎంపికలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 10 వేల మందికి పైగా తరలివచ్చారు. వీరిలో 4,350 మందిని మాత్రం పరీక్షకు అనుమతిచ్చారు. సుమారు 6 వేల మంది రోడ్లపైనే ఉన్నారు. మంగళవారం రాజస్థాన్, మహారాష్ట్ర, అభ్యర్థుల ఎంపిక చేపట్టగా 2,945 మంది వచ్చారు. బుధవారం తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, డయ్యూ, డామన్, లక్షదీప్, మేఘాలయ, పుదుచేర్చి ప్రాంతాల నుంచి 4 వేల మందికి పైగా హాజరయ్యారు. అయితే, అన్ని రాష్ట్రాలకు కలిసి 85 పోస్టులు మాత్రమే ఉండగా.. మొత్తం 20 వేల మందికి పైగా యువకులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో యువకులు వస్తారని ఆర్మీ అధికారులు అంచనా వేయకపోవడం గమనార్హం.
యువకులకు ఉచితంగా భోజనం పెడుతున్న మన క్యాటరింగ్ ప్రతినిధులు
యువకుడు మరణించినా మేల్కోని యంత్రాంగం
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల కోసం టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలనే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా బహిర్భుమికి వెళ్లిన వనపర్తి జిల్లా యువకుడు అరవింద్ విద్యుదాఘాతానికి బలైన విషయం తెలిసిందే. అయినా సరే మేల్కోని అధికారులు తాత్కాలికంగా మూడు మొబైల్ టైయిలెట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వేల మంది యువకులకు రెండు మూడు బాత్‌రూమ్‌లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలియాలి. ఇక వచ్చిన వారికి అనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదు. ఇప్పటికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువకులు చలిలో వణుకుతూ రాత్రివేళ రోడ్ల మీదనే పడుకుంటున్నారు. తమ గోడు పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ యువకుల బాధలు చూడలేక ‘మన క్యాటరింగ్’ నిర్వాహకులు సెంటర్ సమీపంలో తాగునీరు, అల్పాహారం, భోజనం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఎన్నో కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసే ప్రభుత్వం, అధికారులు ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడాన్ని పలు విమర్శలకు తావిస్తోంది.
పట్టించుకునే వారు లేరు
ఆర్మీ సెలక్షన్స్ కోసం కర్ణాటక నుంచి ఒక రోజు ముందే మౌలాలి జేటీఎస్ సమీపంలోని ఆర్‌పీఎస్‌కు చేరుకున్నాం. రాత్రి పడుకోవడానికి కనీస వసతి లేదు. చలిలో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించాం. మా గోడు పట్టించుకునేవారు లేరు.– విటల్, అరుణ్ నాయక్ (కర్ణాటక)
Comments
Please login to add a commentAdd a comment