రా‘బంధువు’!
గుప్తనిధుల పేరుతో పెదనాన్న కుమారుడికి ఎర
రూ.15 లక్షల లాభమంటూ రూ.1.5 లక్షలు స్వాహా
డబ్బు కోసం నిలదీయడంతో దారుణ హత్య
ప్రధాన నిందితుడి అరెస్టు, పరారీలో ఇద్దరు నాగపూర్ వాసులు
సనత్‌నగర్: గుప్తనిధులపై అతడికున్న బలహీనతను క్యాష్ చేసుకున్న బంధువే రాబందువయ్యాడు... ‘పెట్టుబడిగా’ పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమన్నందుకు కర్కశంగా హతమార్చాడు... ఎస్సార్‌నగర్ ఠాణాలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ మర్డర్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఇద్దరు నాగ్‌పూర్ వాసుల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ మండల డీసీపీ ఎం.వెంకటేశ్వరరావు బుధవారం పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్సార్‌నగర్ ఠాణాలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం...
నాగ్‌పూర్ వాసులతో ‘గుప్త’ పరిచయం...
మెదక్ జిల్లా మునిపల్లి మండలం మున్‌సానిపల్లెకు చెందిన చిన్నోళ్ల చంద్రారెడ్డి కుమారుడు చిన్నోళ్ల మాణిక్యరెడ్డి జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మియాపూర్‌లో ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్లినప్పుడు నాగ్‌పూర్ కాచునానికి చెందిన శైలేష్, పదమ్‌లతో ఇతడికి పరిచయమైంది. వీరు కొన్నాళ్ల క్రితం మాణిక్యరెడ్డికి 1818 ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కాయిన్ (నాణెం) చూపించి తమ వద్ద గుప్తనిధులు ఉన్నాయని, వాటిని వెలికితీయడానికి కొంతపెట్టుబడి అవసరమని చెప్పారు. దీంతో అతడు తన వద్ద ఉన్న రూ.2 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు శైలేష్, పదమ్‌లను గుప్తనిధుల విషయం అడగ్గా... వెలికి తీసేందుకు ఇంకా పెట్టుబడి అవసరమని మరో రూ.2.5 లక్షలు ఇస్తే పని పూర్తవుతుందన్నారు. ఆ నిధులు అమ్మగా వచ్చిన డబ్బులో రూ.15 లక్షలు ఇస్తామని నమ్మబలికారు.
గుప్తనిధుల పేరుతో డబ్బు కాజేసి...
దీంతో మాణిక్యరెడ్డి తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఎర్రగడ్డలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న చిన్నాన్న కుమారుడు చిన్నోళ్ల సంతోష్‌రెడ్డి (28)కి ఫోన్ చేశాడు. మహారాష్ట్రలో గుప్తనిధులు ఉన్నాయని, నీవు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే 15 రోజుల్లో నీకు రూ.15 లక్షలు లాభంగా వస్తుందని చెప్పాడు. మాణిక్యరెడ్డి మాటలు నమ్మిన సంతోష్ రూ.1.5 లక్షలు ఇచ్చాడు. 15 రోజులు గడిచినా తన వాటా డబ్బు రాకపోవడంతో సంతోష్ మాణిక్యరెడ్డిని నిలదీశాడు. దీంతో జనవరి 28న గుప్తనిధులు చూపిస్తానంటూ సంతోష్‌ని నాగ్‌పూర్ తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లాక... ఆ నిధులు అమ్మేవారిని తానే హైదరాబాద్‌కు తీసుకొస్తానని చెప్పి మరుసటి రోజు బస్సులో వెనక్కి పంపించాడు.
చందానగర్ లాడ్జిలో హత్యకు కుట్ర...
డబ్బు కోసం సంతోష్ ఒత్తిడి పెంచడంతో జనవరి 30న మాణిక్యరెడ్డి, నాగ్‌పూర్‌కు చెందిన శైలేష్, పదమ్‌లు చం దానగర్‌లోని ఓ లాడ్డిలో సమావేశమయ్యారు. రూ.15 లక్షలు సంతోష్‌కు ఎందుకివ్వాలి? అతన్ని చంపిస్తే మనమే వాటిని పంచుకుందామంటూ కుట్ర పన్నారు. దీన్ని అమలు చేయడంలో భాగంగా 31న సంతోష్‌కు ఫోన్ చేసిన మాణిక్యరెడ్డి మియాపూర్‌కు పిలిపించి తన ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని నర్సాపూర్ రహదారిలో బయలుదేరాడు. గాగిల్లాపూర్ వద్ద స్వప్న వైన్‌షాపులో మద్యం ఖరీదు చేశాడు. గుప్త నిధుల గురించి మాట్లాడుకుందామని నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ గుడి వద్దకు తీసుకెళ్లాడు.
చంపి, కాల్చేశారు...
ఆ ఆలయం వద్ద బైక్ పార్క్ చేసిన మాణిక్యరెడ్డి... సంతోష్‌ను అడవి లోపలికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శైలేష్, పదమ్‌లతో కలిసి నలుగురూ మద్యం తాగారు. సంతోష్ మద్యం మత్తులోకి జారుకోగానే... అందరూ నిద్రించినట్లుగా నటించారు. సంతోష్ పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై మోది అతడిని హత్య చేశారు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహంపై ఉన్న దుస్తులు విప్పి, బైక్ నుంచి తీసిన పెట్రోల్ పోసి కాల్చేశారు. ఫిబ్రవరి 5న సంతోష్ ఫోన్ నుంచి ‘నేను పనిపై బయటకు వచ్చా.. త్వరలోనే తిరిగి వస్తా’నంటూ కుటుంబీకులకు ఎస్సెమ్మెస్ పంపారు. ఆపై సంతోష్‌కు చెందిన రెండు సెల్‌ఫోన్లు మియాపూర్ నాలాలో పడేశారు.
మిస్సింగ్ మిస్టరీ వీడిందిలా...
సంతోష్ ఆచూకీ లభించకపోవడంతో తండ్రి నర్సింహ్మారెడ్డి పలుచోట్ల గాలించాడు. ఫలితం లేకపోవడంతో ఫిబ్రవరి 10న ఎస్సార్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సంతోష్ ఫోన్ల కాల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అతడికి వచ్చిన కాల్స్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఓ నెంబర్‌ను గుర్తించారు. ఆ నెంబర్ సోదరుడు మాణిక్యరెడ్డిదిగా తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ సతీష్, ఎస్సైలు శ్రీనివాస్, నగేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క సంతోష్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ అతడి బంధువులు బుధవారం ఠాణా వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు.