స్టాన్లీ సురేష్ సస్పెన్షన్
Published Fri, Aug 9 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీలోని ఫైన్‌ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్‌ను పాలకవర్గం సస్పెండ్ చేసింది. గురువారం రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యం చేసుకొని.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వర్సిటీ వీసీ పేర్వారం పద్మావతి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సురేష్‌పై తదుపరి చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కమిషన్ తెలిపింది.
అంతకుముందు హైడ్రామా..
చిత్రకళ ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ సుమోటాగా కేసు నమోదు చేసుకుంది. గురువారం మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ టి.వెంకటరత్నంతో పాటు సభ్యులు సుమితకృష్ణన్, జమున.. వీసీ పేర్వారం పద్మావతి ఛాంబర్‌లో సుదీర్ఘంగా విచారించారు. విద్యార్థినుల నుంచి వెంకటరత్నం ఫిర్యాదులను స్వీకరించారు. తమను ప్రొఫెసర్ ఎలా వేధిస్తున్నదీ విద్యార్థినులు ఏకరువు పెడుతూ కంటతడి పెట్టారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ఆమె విద్యార్థులకు హామీనిచ్చారు.
1995 నుంచి ప్రొఫెసర్ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా, ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోవటంతో ఎందుకు ఉపేక్షించారంటూ కమిషన్ సభ్యులు వీసీని ప్రశ్నించారు. వర్సిటీలో మహిళా వేధింపుల నిరోధక కమిటీ లేదని తెలుసుకుని నివ్వెరపోయారు. గతంలో ఆయనపై చర్యలు తీసుకున్నప్పుడు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయని వీసీ తదితరులు సభ్యులకు వివరించారు. అటువంటి వ్యక్తిని ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయాల్సిందేనంటూ కమిషన్ పట్టుబట్టడంతో చివరకు సురేష్‌ను సస్పెండ్ చేశారు.
విచారణకు హాజరుకాని సురేష్..
వర్సిటీలో గురువారం జరిగిన విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్ హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వీసీకి ఫోన్‌చేసి 15 నిమిషాల్లో వస్తానని, భద్రత కావాలని కోరారు. అందుకు ఏర్పాట్లు చేసినా ఆయన రాలేదు. అంతలో కొందరు దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.
అంతలో ‘అరుణోదయ’ విమలక్క.. విద్యార్థినులకు మద్దతుగా అక్కడికి వచ్చారు. సురేష్ 15 ఏళ్లుగా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని పాలకవర్గాన్ని ప్రశ్నించారు. చర్యలకు ఉపక్రమించిన ప్రతిసారీ ప్రొఫెసర్ దళిత కార్డు ప్రయోగిస్తున్నారని తెలిసి విమలక్క విస్తుపోయారు. సురేష్‌కు మద్దతుగా నినాదాలు చేసిన దళిత సంఘాల నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement