మూడోసారి ప్రారంభం ఓ నాటకం
వైఎస్సార్‌సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించడం ఒక నాటకమని, ఇది ముడుపుల కోసం చేపట్టిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. బుధవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 2015లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును అదే ఏడాది సెప్టెంబర్‌లో తొలిసారి చంద్రబాబు ప్రారంభించారన్నారు. ఆ సమయంలో నాలుగు పంపులు పని చేస్తాయని చెప్పారన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పడం కోసం 2016 మార్చిలో మరోసారి ప్రారంభించారన్నారు. మళ్లీ ఇపుడు 24 పంపులతో పని చేయిస్తున్నామని చెబుతూ మూడోసారి ప్రారంభించారన్నారు. ఒక ప్రాజెక్టును ఇన్నిసార్లు ప్రారంభించడం చంద్రబాబుకే చెల్లిందని, ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఇటు ఆన్ చేయగానే.. అటు ఆపేశారు
చంద్రబాబు స్విచ్ ఆన్ చేయగానే విడుదలయ్యే నీరు 66 కిలోమీటర్ల తర్వాత ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో కెమెరాలు, వీడియోలతో ప్రచారార్భాటం ముగిశాక ఇంజినీర్లు పంపులను ఆపేశారని పద్మ పేర్కొన్నారు.
వెయ్యి కోట్లు ముడుపులు
కేవలం ముడుపుల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారని పద్మ దుయ్యబట్టారు. రూ 1300 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టును ఏడాది గడువు లోపు నిర్మించక పోయినా నిర్మించినట్లు న మ్మించేందుకు ప్రారంభోత్సవాలు చేసి కాంట్రాక్టరుకు 21 శాతం అదనంగా నిధులు చెల్లించారని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ పెద్దల జేబుల్లోకి ముడుపులు వెళ్లాయన్నారు.