వైద్య ప్రవేశాల గడువుకు నేడు సుప్రీంలో పిటిషన్
- నెల రోజులు అదనపు సమయం కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
- సుప్రీం అవకాశమిస్తే అక్టోబర్ చివరికల్లా అడ్మిషన్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల గడువును మరింత పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. సోమవారం ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఎంసెట్-3 ప్రవేశ పరీక్ష ఆదివారం ముగిసిన విషయం తెలిసిందే. 16వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. అయితే వైద్య ప్రవేశాల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఈ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. ర్యాంకులు ప్రకటించాక అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి 15 రోజులకు మించి సమయం లేదు. ర్యాంకుల ప్రకటన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియకు కనీసం నెల రోజుల సమయం పడుతుంది. ఆ ప్రకారం నిర్ణీత గడువుకు అదనంగా మరో నెల రోజుల సమయం కావాల్సి ఉంది. కాబట్టి అక్టోబర్ నెలాఖరు నాటికి ప్రవేశాలకు గడువు పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతి ఇస్తే వచ్చే నెలాఖరుకల్లా అడ్మిషన్లు పూర్తి చేస్తారు.
గడువు ఇవ్వకుంటే..?
ఎంసెట్-1 నోటిఫికేషన్ తర్వాత ‘నీట్’పై సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రభుత్వం ఆ ప్రవేశ పరీక్షను కేవలం వ్యవసాయ, ఆయుష్ కోర్సులకే పరిమితం చేసింది. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ ఆశావహులు అనేకమంది ఎంసెట్-1 రాయలేదు. నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు ఎంసెట్-2 నిర్వహించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు నీట్-2 జరిగింది. అయితే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ కావడంతో అది రద్దయింది. దీంతో ఎంసెట్-3 తప్పనిసరైంది. ఇప్పుడు సుప్రీంకోర్టు సమయమిస్తేనే వైద్య ప్రవేశాలు సజావుగా సాగుతాయి. లేదంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అడ్మిషన్లకు సుప్రీం గడువు ఇవ్వకుంటే ఈ నెలాఖరులోగా ఎలాగోలా కౌన్సెలింగ్ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సుదీర్ఘంగా కాకుండా రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయనుంది. రెండు కౌన్సెలింగ్‌లతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఒకే కౌన్సెలింగ్‌తో ప్రైవేటు యాజమాన్యాల సీట్లను భర్తీ చేస్తారు.