గంటన్నరపాటు స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన ఫిర్యాదుదారు.. నామినేటెడ్ ఆగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్ సన్ వాగ్మూలాన్ని బుధవారం ఏసీబీ కోర్టు నమోదు చేసుకుంది. దాదాపు గంటన్నరపాటు స్టీఫెన్సన్ ఇచ్చిన వాగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. ఆ సమయంలో కోర్టు హాలులోకి ఇతరులు ఎవ్వరినీ అనుమతించలేదు.
స్టీఫెన్సన్ నోటి నుంచి వెలువడిన ప్రతి అక్షరాన్ని లిఖిత పూర్వకంగానే కాకుండా రికార్టు చేసినట్లు తెలిసింది. ఆ తరువాత నోట్లు పట్టుబడిన ఇంటి యజమాని మార్క టేలర్, స్టీఫెన్ సన్ కుమార్తె జెస్సికా ఇచ్చిన వాగ్మూలాలను న్యాయమూర్తి రికార్డు చేశారు. మార్క్ టేలర్ 26 నిమిషాలపాటు, జెస్సికా 10 నిమిషాలపాటు న్యాయమూర్తి ముందు మాట్లాడారు. నోట్ల కట్టలతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టయిన రోజు ఆ ఇంట్లో స్టీఫెన్ సన్ తోపాటు మార్క్, జెస్సికాలుకూడా ఉన్నట్లు తెలిసిందే.
కాగా, కోర్టు నుంచి స్టేట్మెంట్ సర్టిఫైడ్ కాపీ ఆధారంగా ముందుకు సాగనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. స్టీవెన్సన్ను కోర్టుకు తీసుకువచ్చే సమయంలో పోలీసులు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. వాగ్మూలాల నమోదు అనంతరం అంతే భద్రతతో స్టీవెన్ సన్, ఆయన కూతురు జెస్సికా, మార్క్ టేలర్ లను వారి ఇంటికి తరలించారు.