నిషేధం ఉన్నా పెంచుతున్నారు
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్యాట్‌ఫిష్ పెంపకం జరుగుతోందని, ఈ క్యాట్‌ఫిష్ చెరువులను ధ్వంసం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్, ధరూర్, ఆలంపూర్, కొల్లాపూర్, వాడేపల్లి, ఐజ తదితర మండలాల్లో క్యాట్‌ఫిష్ పిల్లల ఉత్పత్తి, పెంపకం, రవాణా, మార్కెటింగ్ జరుగుతోందని పిటిషనర్లు వివరించారు.
ఈ వ్యాజ్యాన్ని ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి, జి.రాఘవేందర్‌రెడ్డిలు దాఖలు చేశారు. ఇందులో మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డెరైక్టర్, జిల్లా కలెక్టర్, ఎస్‌పీలతో పాటు స్థానిక పోలీసులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చి, క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారన్నారు. జిల్లాలో వేయి నుంచి 2వేల ఎకరాల్లో క్యాట్‌ఫిష్ పెంపకం జరుగుతోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు.