
తెంచుకుపోతున్నారు మహాప్రభో
10 నిముషాల్లో 10 తులాల బంగారం సంపాదించడం ఎట్లాగో ఎవరికైనా తెలుసా
10 నిముషాల్లో 10 తులాల బంగారం సంపాదించడం ఎలాగో ఎవరికైనా తెలుసా .. తెలియదా? అయితే హైదరాబాద్ నగరంలో పోలీసు స్టేషన్లలో నమోదువుతున్న క్రైం రిపోర్టు చూస్తే తెలుస్తుంది. జంట కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లో చైన్ స్నాచర్ల కేసులు ఎవరెస్ట్ కొండను తలదన్నేలా రోజురోజుకూ పెరిగిపోతుంది.
రోజుకు కనీసం 15 నుంచి 20 కేసులు చైన్ స్నాచింగుల కేసులే నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ అని కాదు నగరవ్యాప్తంగా చైన్ స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో నగరంలో ఆర్థరాత్రే కాదు... పట్టపగలు కూడా రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొందని నగర మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొన్న యూసఫ్గూడలో చైన్ స్నాచర్లు ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మీ మెడలో గొలుసు తెంచుకుపోయారు. నిన్న అమీర్పేట, మధురానగర్, ఈఎస్ఐ ప్రాంతాల్లో నడిరోడ్డుపై పట్టపగలు నలుగురు మహిళల మెడల్లోని దాదాపు 30 తులాల బంగారపు గొలుసులను తెంచుకుని పోయారు. జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజుకు15 నుంచి 20 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అవుతున్నాయని సమాచారం.
మొన్నామధ్య ఓ చైన్స్నాచర్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటే.. గొలుసు దొంగలను కూడా అంతలా చంపాలా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ, తీరాచూస్తే అతగాడికి ఓ పెద్ద బంగ్లా లాంటి ఇల్లు, రెండు మూడు పెద్ద విలాసవంతమైన కార్లు, భారీ ఎల్ఈడీ టీవీ.. ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ గొలుసులు తెంపి సంపాదించినవే! అంత స్థాయిలో వాళ్లు విలాసాలు అనుభవిస్తుంటే.. ఇటు బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నవాళ్లు మాత్రం తమ జీవితకాల సంపాదన పోయిందంటూ వాపోతున్నారు.