
నియమావళి పటిష్టం
ప్రశాంత ఎన్నికలకు పార్టీలు సహకరించాలి
ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి
సిటీబ్యూరో: త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం టూరిజం ప్లాజాలో రాజకీయపార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు వార్డుకొక రిటర్నింగ్ అధికారిని నియమించినట్లు తెలిపారు. దాదాపు 7750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని , 10 వేల ఈవీఎంలను ఎన్నికలకు వినియోగిస్తుండగా, మరో రెండువేల ఈవీఎంలను అదనంగా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరు మించి సంతానం ఉండరాదనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని, టెండర్ ఓట్లు 0.1 శాతం కంటే ఎక్కువ పోలైతే రీపోలింగ్‌కు అవకాశముందని తెలిపారు. అభ్యర్థుల గరిష్ట వ్యయం పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించామని, ఎన్నికల ఖర్చుల నిర్వహణకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలని తెలిపారు. నామినేషన్ డిపాజిట్ రూ. 5వేలు కాగా, ఎస్సీ,ఎస్టీలకు నామినేషన్ రూ. 2500 లని చెప్పారు. వ్యయపరిమితిని రూ. 2 లక్షలకంటే పెంచాలని వచ్చిన సూచనల్ని పరిశీలిస్తామన్నారు.
దేశంలోనే ఐదవ అతిపెద్ద నగరమైన హైదరాబాద్ ఎన్నికలు ప్రశాం తంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాల్సిందిగా కోరారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను ప్రజ లకు మరింత అందుబాటులో ఉంచేందుకు మొట్టమొదటిసారిగా ఓటర్ల పోలింగ్ కేంద్రాలను వెబ్‌సైట్‌లో తెలుసుకునేలా, పోల్‌స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూ డా కల్పించామన్నారు. సమావేశంలో ప్రధాన పార్టీల ప్రతినిధులతోపాటు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి(టీఆర్‌ఎస్), వనం రమేశ్(టీడీపీ), వెం కటరెడ్డి(బీజేపీ), సుధాకర్(సీపీఐ), అమ్జదుల్లాఖాన్(ఎంబీటీ), ఎం.శ్రీనివాస్(సీపీఎం), రామకృష్ణ(బీఎస్‌పీ) తదితరులు మాట్లాడారు. వివిధ అంశాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఎన్నికల తేదీ పొడిగించాలి: మర్రిశశిధర్‌రెడ్డి (కాంగ్రెస్)
డిసెంబర్ 15 లోగా పూర్తికావాల్సిన వార్డుల రిజర్వేషన్లు పూర్తికానందున, అందుకనుగుణంగా ఎన్నికల తేదీని పొడిగించాలి. హైకోర్టుకిచ్చిన సమాచారం మేరకు, జనవరి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియపూర్తిచేసేందుకు డిసెంబర్ 15 నాటికే వార్డుల రిజర్వేషన్లు పూర్తి కావాల్సి ఉంది. అది ఆలస్యం జరిగినందునఎన్నికలు కూడా జనవరి తర్వాత జరపాలి. లేని పక్షంలో న్యాయపోరాటానికి వెనుకాడం. నగరంలో పెద్దయెత్తున వెలసిన రాజకీయఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి.
మరింత సమయం అవసరం లేదు: జాఫ్రీ (ఎంఐఎం)
వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాక ఇక అభ్యంతరాలకు ఆస్కారముండదు. చట్టం, నిబంధనల మేరకు వార్డుల్ని వెలువరించాక నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు జరపవచ్చు. ఎన్నికల తేదీని పెంచాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపైనర్లు వచ్చే అవకాశం ఉన్నందున ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి.
అంతా గందరగోళం: శివకుమార్ (వైఎస్సార్‌సీపీ)
వార్డుల డీలిమిటేషన్‌లో, బీసీ జాబితాలో అంతా గందరగోళం జరిగింది. అవి సరిచేయకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదు. వార్డుల రిజర్వేషన్లకు, ఎన్నికల షెడ్యూలుకు మధ్య కనీసం వారం రోజుల వ్యవధి ఉండాలి. అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అధికార పార్టీకి తలొగ్గి వ్యవహరించొద్దు. అలా చేస్తే ప్రజలే బుద్ధిచెబుతారు.