
సెంట్రల్ వర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన మరవకముందే సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ శనివారం తెల్లవారుజామున ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యపై సహచర విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. యూనివర్సిటీ వీసీ పి. అప్పారావు హుటాహుటిన ఎల్ బ్లాక్కు చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంతా తెలియలేదని వీసీ అప్పారావు తెలిపారు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడని చెప్పారు.
ప్రవీణ్ స్వస్థలం మహబుబ్నగర్ జిల్లా షాద్నగర్ అని ఆయన పేర్కొన్నారు. ప్రవీణ్ అత్మహత్యపై యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రవీణ్ గదిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎటువంటి లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.