హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు, వైద్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. విద్యార్థుల కోసం కాలేజి బస్సు ఉండగా.... ప్రైవేట్ బస్సులో విద్యార్ధులను అమలాపురం ఎందుకు పంపారని... విద్యార్థులు, వైద్యులు కాలేజీ ప్రిన్సిపల్ను ప్రశ్నించారు. విజయవాడలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదం జరిగి.. నలుగురు మృతి చెందిన ఘటనకు కాలేజీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్తోపాటు పీడీనే బాధ్యులు అని వారు ఆరోపించారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ... ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వారిని విద్యార్థులు, వైద్యులు డిమాండ్ చేశారు. దీంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశంపై కాలేజీ ఉన్నతాధికారులు విజయవాడలో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి.... ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని కాలేజీ విద్యార్థులు, వైద్యులకు హామీ ఇచ్చారు.