అగ్రిగోల్డ్ కేసు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం వాటిని మరోసారి విచారించింది. గత విచారణంలో అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేసుకునేందుకు ఓ కంపెనీ సిద్ధంగా ఉందంటూ కంపెనీ పేరు బహిర్గతం చేయని శ్రీరఘురాం సోమవారం నాటి విచారణ సందర్భంగా ఆ కంపెనీ పేరును వెల్లడించారు.
సుభాష్ చంద్ర ఫౌండేషన్ కంపెనీ టేకోవర్‌కు సిద్ధంగా ఉందని, డిపాజిట్ల చెల్లింపు బాధ్యత కూడా ఆ కంపెనీదేనని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... కంపెనీ టేకోవర్ చర్యలు ప్రారంభించి, మధ్యలో వెనక్కి వెళ్లిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ముందుగా కొంత మొత్తం డిపాజిట్ చేయాలని, ఒకవేళ మధ్యలో వెనక్కి వెళ్లిపోతే ఆ మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని కోరవచ్చునని, అయితే ఈ వ్యవహారంలో ఆలస్యానికి కారణమైనందుకు కొంత మొత్తాన్ని మినహాయించుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది.
అలాగే డిపాజిట్ల చెల్లింపు విధి విధానాలను సిద్ధం చేసి తమ ముందుం చాలంది. ఈ విషయంలో పిటిషనర్లకు ఏమైనా అభ్యంతరం ఉందా? అని ధర్మాసనం కోరగా... తాము కౌంటర్ దాఖలు చేశామని పిటిషనర్ల న్యాయవాది అర్జున్ తెలిపారు. నాలుగు నెలల గడువు కాకుండా రెండు నెలల గడువును ఇవ్వాలని, అలాగే చిన్న మొత్తాలు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని శ్రీరఘురాంకు ధర్మాసనం సూచించింది.