సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఈ–వేలం విధానంలో విక్రయించాలని హైకోర్టు నిర్ణయించింది. ముందుగా కృష్ణా జిల్లాలోని అత్యంత ఖరీదైన ఐదు ఆస్తులను జిల్లా స్థాయి కమిటీ ద్వారా అమ్మాలని ఆదేశాలిచ్చింది. జిల్లా కలెక్టర్, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేలం ప్రక్రియను ప్రారంభించాలని, ఈ కమిటీకి సీఐడీలోని బాధ్యత గల అధికారి సహకరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
విజయవాడ గాంధీనగర్‌లోని వాణిజ్యపరమైన షెడ్‌తో కూడిన 1,712 చదరపు గజాల స్థలం, మొగల్‌రాజపురంలోని భవనం, పాయకరావుపేటలోని ఖాళీ స్థలంతోపాటు, వీర్లపాడు మండలంలోని వ్యవసాయ భూమి, జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని స్థలాలను ఈ–వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ‘మా ఉత్తర్వులు వెలువడిన రెండు వారాల్లోగా ఆగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నోటిఫికేషన్ విడుదల చేయాలి. రెండు తెలుగు దినపత్రికల జిల్లా ఎడిషన్లలో ప్రకటనలు ఇచ్చి పూర్తి వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.
వేలంలో నిర్ణయించిన కనీస ధరలో పదో శాతం వేలందారులు డిపాజిట్ చేయాలి. వేలం గురించి ముందుగానే దండోరా వేయించాలి. కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయాలి. గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లోని బోర్డుల్లో వేలం వివరాలు ప్రదర్శించాలి. ఈ–వేలం నిబంధనలను జిల్లా స్థాయి కమిటీ అమలు చేయాలి. నోటిఫికేషన్ తర్వాత ఆరువారాల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలి’ అని షరతులు విధించింది.
విచారణ సాగిందిలా: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కంపెనీల మోసాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆస్తుల్ని విక్రయించాలని, ఆ కమిటీలో కలెక్టర్, రిజిస్ట్రార్లతోపాటు జిల్లా జడ్జి ఉండాలని గత విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సూచించారు. న్యాయపరంగా కేసుల ఒత్తిడి ఉన్నందున జిల్లా జడ్జిని నియామకానికి ధర్మాసనం అంగీకరించలేదు. జిల్లా జడ్జి స్థానంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉంటారని స్పష్టం చేసింది.
కాగా, అగ్రిగోల్డ్‌కు చెందిన 10 ఆస్తులను వేలం వేసేందుకు జాబితాను ఏపీ సీఐడీ గతంలో హైకోర్టుకు సమర్పించింది. వీటిలో ఐదు ఆస్తుల వేలానికి న్యాయస్థానం అనుమతిచ్చింది. మిగిలిన ఐదింటిలోని ఒక ఆస్తిని తమ ఆస్తుల జప్తునకు ముందే 2015లోనే అమ్మేసినట్లుగా అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఆస్తిని అమ్మి ఉంటే ఈసీలో కొనుగోలు చేసిన యజమాని పేరు ఎందుకు లేదని ఏజీ ప్రశ్నించారు. ధర్మాసనం కల్పించుకుని.. గతంలోనే విక్రయించినట్లు చెబుతున్న సదరు ఆస్తికి చెందిన రిజిస్ట్రేషన్ పత్రాల్ని తమ ముందుంచాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
మరో రెండు ఆస్తులు ఆంధ్రాబ్యాంకులో తనఖా పెట్టినందున వాటి జోలికి ధర్మాసనం వెళ్లలేదు. నెల్లూరు జిల్లాలోని రెండు ఆస్తులకు సీఐడీ అధికారులు నిర్ణయించిన విలువ తక్కువగా ఉందని అగ్రిగోల్డ్ అభ్యంతరం చెప్పడంతో ఈ రెండింటి వేలంపై ధర్మాసనం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ నెల 25న జరిగే తదుపరి విచారణ నాటికి వేలం ప్రక్రియలో పురోగతి తెలపాలని ఆదేశించింది.
అక్షయ గోల్డ్ కేసులో..
మరోవైపు అక్షయగోల్డ్ కేసులో నాలుగు ఆస్తుల్లో రెండింటికి మాత్రమే బిడ్లు వచ్చాయి. కర్నూలులో ఒక భవనాన్ని కొనుగోలు చేసేందుకు రూ.1.31 కోట్లకు అత్యధిక బిడ్ వచ్చింది. అయితే పిటిషనర్ తీసుకొచ్చిన వ్యక్తి అదే భవనాన్ని రూ.1.51 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారి న్యాయవాది కరణం శ్రవణ్‌కుమార్ తెలిపారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అత్యధిక బిడ్ దాఖలు చేసిన వ్యక్తితోపాటు పిటిషనర్ తీసుకొచ్చిన వ్యక్తినీ 25న జరిగే విచారణకు తీసుకురావాలని ఆదేశించింది. ఇక్కడే ఆ భవనం ధర ఎంతో తేల్చుతామంది. మరో ఆస్తికి ఒకే బిడ్ దాఖలు కావడంతో దాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో అక్షయగోల్డ్‌కున్న పది ఆస్తుల విలువలతో పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ అందజేయగా.. వీటి విలువలపై పిటిషనర్ అభిప్రాయం తెలపాలని ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment