సూసైడ్...రైడ్‌ | Suicide ... Ride | Sakshi
Sakshi News home page

సూసైడ్...రైడ్‌

Published Sun, Jun 12 2016 12:54 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

సూసైడ్...రైడ్‌ - Sakshi

సూసైడ్...రైడ్‌

నవంబర్ 23, 2015

 
హైదరాబాద్ నుంచి బయలుదేరిన నగర యువతి సనాఇక్బాల్ యావత్ భారతాన్ని చుట్టి నేడు నగరానికి చేరుకుంటున్నారు. ఆరున్నర నెలలు... 100కు పైగా నగరాలు.. 40 వేల కిలోమీటర్లు..  ఒంటరిగా ప్రయాణం... ఎందుకీ యువతి ఇంతటి సాహసం చేసింది? ఏం అనుభవాలు మూటకట్టుకుని వస్తోంది?           - ఓ మధు

 

 నెలల బాబును ఇంట్లో వదిలి పెట్టి ఈ యాత్ర చేపట్టడానికి ఈ తల్లికి బలమైన కారణం గొప్ప సంకల్పం, సందేశం రెండూ ఉన్నాయి. ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదనే సందేశంతో బయలుదేరిన సనా అనుభవాలు ఆమె మాటల్లోనే... ‘మా అమ్మ అడ్వకేట్. నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. నా జీవితంలోనూ చాలా ఎత్తుపల్లాలున్నాయి. ఐదేళ్ల క్రితం నా జీవితం బతకడానికి పనికిరానిదనిపించేది. అయితే నేను డిప్రెషన్‌లో ఉన్నానని నాకు తెలియదు. సందేహం వచ్చి చెక్ చేసి చూసుకున్నా. నాలో  డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నా. కానీ విధిని ఎవరూ మార్చలేరు, దుఖాన్ని పక్కకు పెట్టి సంతోషం వైపు సాగేందుకు ప్రయత్నించా. అతి కష్టమ్మీద నాకు నేనుగా ఈ డిప్రెషన్ నుంచి బయటపడ్డా. అప్పుడు నాకు అర్థమైంది ఎలాంటి ఆలోచనలు డిప్రెషన్‌కి ఆ తర్వాత సూసైడ్‌కి దారి తీస్తాయో...

 
అమ్మ ఒప్పుకోలేదు...

తల్లిదండ్రులు తమ జీవితాల్లో ఉన్న చిరాకు, విసుగుని, అపజయాలను పిల్లల మీద చూపిస్తారు. పేరెంట్స్ సంతోషంగా లేకపోతే పిల్లల మీద ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. దేశంలో చాలామంది పిల్లల డిప్రెషన్‌కి కారణం ఇదే. తల్లిదండ్రులు విచారంగా, కోపంగా ఉండటం చూసి పిల్లలు డిప్రెషన్‌కి లోనవుతారు. ఆత్మహత్య ఏ సమస్యకి పరిష్కారం కాదనే నినాదంతో పాటు పిల్లల డిప్రెషన్‌కి కారణాలు అన్వేషిస్తూ ఈ రైడ్ ప్లాన్ చేశాను. ముందు మా అమ్మ దీనికి ఒప్పుకోలేదు. అయితే కొందరు డిప్రెషన్ బాధితుల విషయంలో నేను చూపిన చొరవ, వచ్చిన మార్పును అమ్మ గమనించింది. రైడ్‌కు ఓకే చెప్పింది. రైడ్‌లో  కేంద్ర పాలిత ప్రాంత నగరాలు తప్ప అన్నీ చుట్టేశా. వివిధ రాష్ట్రాల్లోని కళాశాలల్ని సందర్శించా. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కలిశా. డెరైక్ట్‌గా సూసైడ్ అనే విషయంపై మాట్లాడకుండా వాళ్ల మీద ఉండే ఒత్తిడిని విశ్లేషించా. చిన్న చిన్న కథలతో వారిలోని భయాలను, ఆందోళనలను తగ్గించేందుకు ప్రయత్నించా. వారికి అవసరమైన మనోనిబ్బరాన్ని అందించేందుకు నా వంతు కృషి చేశా. 

 

 
ప్రేమను పెంచిన రైడ్...

భారత్ చాలా సేఫ్ కంట్రీ. ఇక్కడి స్త్రీలకు ఏ ఎంపవర్‌మెంట్ అవసరం లేదు. వీరికి దేశంలో ప్రతి చోటా గౌరవం ఉంది. నేను వెళ్లిన ప్రతి చోట ఆ గౌరవాన్ని, ఆదరణను పొందాను. ఆడపిల్లను అని ఎవరూ, ఎక్కడా తక్కువ చేసి చూడలేదు. తప్పుగా ప్రవర్తించలేదు. యూపీలో ఓ పెద్ద యాక్సిడెంట్ అయింది. దెబ్బలు తగిలి ముఖం బాగా పాడయింది. ఈ టూర్‌కి ముందు ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే తప్పకుండా డిప్రెషన్‌లోకి వెళ్లేదాన్ని. కానీ పాడైన ముఖం ఇప్పుడు నన్ను బాధ పెట్టడం లేదు. నన్ను నేను ఎలా ప్రేమించాలి, గౌరవించాలి, నాకేం కావాలి ఇవన్నీ ఈ రైడ్ నుంచి నేర్చుకున్న పాఠాలే. ఈ రైడ్‌లో అనుభవాలన్నీ రాయలంటే ఒక్క పుస్తకం సరిపోదు, సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్నా. కార్పొరేట్ ట్రెయినర్‌గా ఉద్యోగం.. నెలకు 50 వేల జీతం. 7 నెలలుగా జీతం లేదు. ఈ టూర్‌కి లక్షాఎనభై వేలకు పైగా ఖర్చు అయ్యింది. సేవింగ్స్ అన్నీ ఖాళీ అయ్యాయి. కానీ ఇప్పుడు జీవితానికి కావలసిన విలువైన అనుభవాలు, పాఠాలు మాత్రం నా దగ్గరున్నాయి.

 

 

పాజిటివ్‌గా ఉండండి...
ఎవరితో అయినా ఆత్మవిశ్వాసంతో, మృదువుగా మాట్లాడండి.
ఫ్రెండ్లీగా, ఫ్రెండ్‌గా ఉండటానికి తేడా తెలుసుకుని అందరితో స్నేహభావంతో మెలగండి.
బాడీలాంగ్వేజ్, మాటతీరు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.
కాన్ఫిడెంట్‌గా ఉండే అమ్మాయిని చూసి ఎవరూ ఆకతాయిగా మసలుకోరని మాత్రం
అనుభవ పూర్వకంగా  చెప్పగలను.                  
-సనా

 

సూసైడ్ దేనికి పరిష్కారం కాదు... మరి సూసైడ్‌కి పరిష్కారం... తనలా జీవితం నుంచి అనుభవాల నుంచి స్వయంగా స్ఫూర్తి పొందటమే అని వివరిస్తున్న సనా దేశ పర్యటన ముగించి నేడు నగరానికి తిరిగివస్తున్నారు. తమ వాండరర్‌ని సిటీ బుల్లెటీర్స్ నేడు ఘనంగా స్వాగతించనున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement