భగ్గుమన్న సూరీడు
భగ్గుమన్న సూరీడు..ఈ సీజన్‌లో రికార్డు
37.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికం..
మరో నాలుగైదు రోజులు మండుటెండలే..
సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఎండ మండిపోయింది. సోమవారం ఈ సీజన్‌లోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, పశ్చిమ దిశ నుంచి గ్రేటర్‌వైపు వీస్తున్న వేడిగాలులు నగరాన్ని అప్పుడే నిప్పుల కుంపటిగా మార్చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికమని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగైదు రోజులపాటు నగరంలో మండుటెండలు తప్పవని వాతావరణ శాఖ పేర్కొంది.
మధ్యాహ్నం ఎండలో బయటికి వెళ్లే పాదచారులు, వాహనచోదకులు ఎండబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండవేడిమి పెరగడంతో సిటీలో శీతలపానీయాలు, కొబ్బరిబోండాలకు గిరాకీ అమాంతంపెరిగింది. శివరాత్రి పర్వదినం కంటే ముందుగానే ఎండలు మండిపోవడం పట్ల సిటీజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది ఫిబ్రవరి 23న నగరంలో 38.7 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం.